అసభ్య వ్యాఖ్యలపై.. ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అసభ్య వ్యాఖ్యలపై.. ఆగ్రహం

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

వైఎస్సార్‌ సీపీ నిరసనల హోరు అనుచిత వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా ప్రదర్శనలు

పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలపై అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. జర్నలిజం నైతిక విలువలను ఆయన మంటగలిపారని వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. నీతి బాహ్యమైన వ్యాఖ్యలతో ఏబీఎన్‌లో రాధాకృష్ణ చేసిన ప్రసారాలను పార్టీ మహిళా నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జిల్లావ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్లలో వైఎస్సార్‌ సీపీ నేతలు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల నుంచి పోలీస్‌ స్టేషన్ల వరకూ ర్యాలీలు నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న ఏబీఎన్‌ను బ్యాన్‌ చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

– సాక్షి ప్రతినిధి, కాకినాడ

కించపరిచే వ్యాఖ్యలతో వ్యక్తిత్వ హననం

తుని: ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీడియా సొంత లాభం కోసం రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచే వ్యూహరచనకు తెర తీసిందని ఎల్లో మీడియానుద్దేశించి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. తునిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలపై భారం లేకుండా ఉండాలనే ఆలోచనతో వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా ఆయన కుటుంబాన్ని టార్గెట్‌ చేసిందని, రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా ఏబీఎన్‌ రాధాకృష్ణ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయాలకే ఏకంగా రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇదంతా అప్పేనని రాజా చెప్పారు. దీనికే ఇంత అయితే ఇతర నిర్మాణాలకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతాయో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ రాజధానిని ఐదు జిల్లాలను కలిపి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని ఏర్పాటు చేస్తే కేవలం రూ.20 వేల కోట్లతో నిర్మాణాలు పూర్తి చేయవచ్చునని చెప్పారు. ఇదే విషయాన్ని జగన్‌ ప్రతిపాదిస్తే చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శించారు. అమరావతి రాజధానికి వైఎస్సార్‌ సీపీ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడానికి చంద్రబాబు పన్నిన కుట్రకే వ్యతిరేకమని రాజా స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన తుని మండలం ఎస్‌.అన్నవరంలోని పార్టీ కార్యాలయం నుంచి మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంపీపీ లగుడు శ్రీనివాస్‌, పార్టీ తుని, తొండంగి, తుని పట్టణ అధ్యక్షులు దుంగల నాగేశ్వరరావు, బత్తుల వీరబాబు, అన్నవరం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రాధాకృష్ణను అరెస్టు చేయాలంటూ పార్టీ కాకినాడ రూరల్‌ కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి కురసాల కన్నబాబు నాయకత్వాన సర్పవరం ఎస్సై ఏసుబాబుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో పెన్‌ డ్రైవ్‌ అందజేసి, రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎస్సై నుంచి రసీదు కూడా తీసుకున్నారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కొప్పన శివ, జెడ్పీటీసీ, పార్టీ కాకినాడ రూరల్‌ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, పార్టీ మండల ఉపాధ్యక్షుడు రామదేవు చిన్నా, ఎస్‌ఈసీ సభ్యుడు గోపుశెట్టి బాబ్జీ, జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పిశెట్టి గణేష్‌, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కడియాల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

పిఠాపురంలో పార్టీ నాయకులు, మహిళలతో కలసి మాజీ ఎంపీ, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వంగా గీతా విశ్వనాథ్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీ్త్ర జాతిని కించపరిచిన రాధాకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్‌కే కార్యక్రమం ఎప్పుడూ తప్పుడు కథనాలు, తప్పుడు ఆరోపణలతోనే నడుస్తోందని ఆక్షేపించారు. చివరకు బరితెగించి ఇటీవల జుగుప్సాకరమైన భాషలో మహిళలను కించపరిచే విధంగా కథనాన్ని ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుడు గండేపల్లి బాబీ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉలవల భూషణం తదితరులు పాల్గొన్నారు.

సామర్లకోటలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలసి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు పెద్దాపురం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దాపురం సీఐ ఎ.కృష్ణభగవాన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకుడు నెక్కంటి సాయిప్రసాద్‌, రాష్ట్ర అయ్యరక సంఘం అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, ఉమ్మడి రాష్ట్ర కార్మి క సంఘం నాయకుడు దవులూరి సుబ్బారావు, ఆప్కో రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ ముప్పన వీర్రాజు, మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉబా జాన్‌మోజెస్‌, జెడ్పీటీసీ సభ్యుడు గవరసాని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్తిపాడులో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యాన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలసి గిరిబాబు ర్యాలీగా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. రాధాకృపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సై ఎస్‌.అనంతలక్ష్మికి ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు రికార్డు చేసిన పెన్‌ డ్రైవ్‌ను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వాసిరెడ్డి జమీలు, జెడ్పీటీసీ సభ్యులు బెహరా రాజరాజేశ్వరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

ఏబీఎన్‌ చానల్‌లో వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్‌కే కార్యక్రమాన్ని మహిళలను కించపరచడానికే నిర్వహి స్తున్నట్టుగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్‌ తోట నరసింహం దుయ్య బట్టారు. రాధాకృష్ణ తీరును నిరసిస్తూ ఆయన ఆధ్వర్యాన పార్టీ నాయకులు, కార్యకర్తలు జగ్గంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని రాధాకృష్ణకు వ్యతిరేకంగా ప్ల కార్డులతో నిరసన తెలిపారు. అనంతరం నరసింహం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నేతలు ఒమ్మి రఘురాం, కె.జాన్‌వెస్లీ, గుల్లా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర లక్ష్మీశివప్రసన్న ఆధ్వర్యాన పార్టీ సిటీ కార్యాలయం నుంచి టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకూ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. రాధాకృష్ణ డౌన్‌డౌన్‌.. ఏబీఎన్‌ హఠావో అంటూ నినాదాలు చేశారు. రాధాకృష్ణపై కాకినాడ సాంబమూర్తి నగర్‌కు చెందిన పట్టెపు హేమంత కుమార్‌ టూటౌన్‌ ఎస్సైకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్‌ మీసాల దుర్గాప్రసాద్‌, మాజీ కార్పొరేటర్లు కంపర బాబీ, చిట్నీడి మూర్తి, బోరా పెద్ద తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ రూరల్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం కక్కడమే ఏబీఎన్‌ రాధాకృష్ణ పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్‌ సీపీ కాకినాడ రూరల్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సర్పవరం పో లీస్‌ స్టేషన్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీకి మద్దతుగా ఉన్న ఎల్లో మీడియా వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్‌మోహన్‌రెడ్డిని, ఆయన కుటుంబాన్ని చాలా దుర్మార్గంగా చిత్రిస్తోందని ధ్వజమెత్తారు. అమరావతికి చట్టభద్రత కల్పించే పేరుతో పార్లమెంట్‌లో చట్టాన్ని చేస్తూ అదేదో పెద్ద ఘనకార్యంలా చంద్రబాబునాయుడు చిత్రీకరించుకున్న క్రమంలో రాజధాని అంశం మరోసారి తెర పైకి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతికి రూ.2 లక్షల కోట్లు కావాలని, అదే రూ.20 వేల కోట్లు ఖర్చు పెడితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని గ్రోత్‌ కాపిటల్‌ కారిడార్‌గా చేసుకోవచ్చని జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారని వివరించారు. దీనిపై రాధాకృష్ణ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే సభ్యత, సంస్కారం వదిలేసి, మహిళలను, వైఎస్సార్‌ సీపీ నాయకుల భార్యలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని కన్నబాబు హెచ్చరించారు. రాధాకృష్ణపై ఎఫ్‌ఐఆర్‌ వేసే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement