అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వ్రత విభాగం సిబ్బంది, కొంత మంది వ్రత పురోహితులు నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. దేవస్థానం వ్రత విభాగం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి, తమ విధులను ఓ వ్రత పురోహితునికి అప్పగించడం.. అతడు 2024 జనవరి నుంచి గత ఏడాది డిసెంబర్ వరకూ వ్రత పురోహితుల పారితోషికం బిల్లును పెంచి, ఆ మొత్తాన్ని చేతివాటం చూపి కాజేయడం.. ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఈ అవకతవకలపై విచారణ జరిపి, ఆ పురోహితుని చేతివాటం చూపిన మొత్తం రూ.58.39 లక్షలుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం గత డిసెంబర్‌లో వెలుగు చూడటంతో అధికారులు నిలదీయగా అతడు సగం సొమ్ము చెల్లించాడు. అనంతరం, అతడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనలు గత జనవరిలో దేవస్థానంలో తీవ్ర సంచలనం రేపాయి. ఆ పురోహితుడు చేతివాటం చూపిన రూ.58.39 లక్షల్లో ఎక్కువ మొత్తం తన ఖాతాకు, తన భార్య, అత్త, బావమరిది ఖాతాలకే మళ్లించాడు. ఇందులో రూ.28.54 లక్షలు గత డిసెంబర్‌లో రికవరీ చేశారు. మిగిలిన రూ.29.85 లక్షల్లో రూ.8 లక్షలు తన ఖాతాకు, రూ.2.5 లక్షలు భార్య ఖాతాకు, తన ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్‌కు రూ.1.40 లక్షలు మళ్లించాడు. మిగిలిన రూ.17.95 లక్షలు 12 మంది పురోహితుల అకౌంట్లకు జమ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ 12 మందిలో తన బావమరిదికి రూ.4 లక్షలు, మరో పురోహితునికి రూ.5 లక్షలు, ఒకరికి రూ.1.90 లక్షలు, మరొకరికి రూ.90 వేలు పంపించినట్టు తేలింది. మిగిలిన ఎనిమిది మందిలో ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకూ పంపించాడు. ఈ అవకతవకల్లో సిబ్బంది నిర్లక్ష్యం, ఇతర పురోహితుల తప్పిదం ఉన్నట్టు తేలడంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు గురువారం ఆదేశాలు ఇచ్చారు.
క్రమశిక్షణ చర్యలు ఇలా..
● ఏఈఓలు పి.జగ్గారావు, ఎల్.శ్రీనివాసరావు, వ్రత విభాగంలో 2024 నుంచి సూపరింటెండెంట్లుగా పని చేసిన భాస్కర్, కె.సతీష్, కేవీఎస్‌ఎన్ మూర్తి, ఎంవీ సుబ్రహ్మణ్యం, సీనియర్ అసిస్టెంట్ వెలగా రమేష్‌లకు ఒక ఇంక్రిమెంట్ కట్ చేశారు.
● ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావుపై చర్య తీసుకోవాలని కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు.
● తమ ఖాతాలకు అధిక మొత్తాలు జమ అవుతున్నా ఆ విషయాన్ని దేవస్థానానికి తెలియజేయకపోవడాన్ని అపరాధంగా భావిస్తూ 13 మంది వ్రత పురోహితులపై కూడా ఈఓ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
● రూ.4 లక్షలు అంతకు మించిన మొత్తం జమ అయిన ఇద్దరు పురోహితులకు రెండు ఇంక్రిమెంట్లు కట్ చేశారు. వీరికి సుమారు 30 ఏళ్ల సర్వీసు ఉంది. పురోహితులకు నెలకు రూ.2 వేల ఇంక్రిమెంట్ జమ అవుతుంది. రెండు ఇంక్రిమెంట్లు అంటే రూ.4 వేలు. ఆవిధంగా చూస్తే ఈ ఇద్దరు పురోహితులకు ఒక్కొక్కరికి రూ.14.40 లక్షల మేర కట్ కానుంది.
● రూ.2 లక్షల వరకూ అకౌంట్‌లో జమ అయిన మరో ఇద్దరు పురోహితులకు ఒక ఇంక్రిమెంట్ కట్ చేశారు. వీరికి కూడా సుమారు 25 ఏళ్ల సర్వీసు ఉంది. అంటే ఒక్కొక్కరికి సుమారు రూ.6 లక్షలు కట్ అవుతుంది.
● మిగిలిన తొమ్మిది మంది పురోహితులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ జరిమానా విధించారు.
● ఈ వ్యవహారంలో పూర్తి బాధ్యత కలిగిన రెగ్యులర్ ఉద్యోగుల కన్నా వ్రత పురోహితులకే భారీ పనిష్మెంట్ విధించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పురోహితులు ఈఓను కలిసి నలుగురు పురోహితుల ఇంక్రిమెంట్లు కట్ చేయడాన్ని నిలిపివేయాలని కోరనున్నట్లు సమాచారం.
అన్నవరం దేవస్థానం
పురోహితుని చేతివాటం వ్యవహారంలో
20 మందిపై క్రమశిక్షణ చర్యలు
ఏడుగురు సిబ్బందికి ఒక ఇంక్రిమెంట్ కట్
13 మంది పురోహితుల పైనా చర్యలు
విశ్రాంత ఏసీపై చర్యకు
కమిషనర్‌కు నివేదిక
ఈఓ త్రినాథరావు ఆదేశం


