నెహ్రూ యూ టర్న్
● రాజకీయాలకు గుడ్‌బై చెబుతారని
గతంలో చెప్పిన అనుచరులు
● వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని
తాజాగా జ్యోతుల వెల్లడి
● మూడున్నరేళ్లకు ముందే
జగ్గంపేట ఎమ్మెల్యే ప్రకటన
● పట్టు నిరూపించుకునే
వ్యూహమంటున్న విశ్లేషకులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయ రిటైర్‌మెంట్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ యూ టర్న్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను తిరిగి పోటీ చేస్తానంటూ తాజాగా ఆయన చేసిన ప్రకటన ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తనయుడు, జ్యోతుల నవీన్ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంపై జగ్గంపేటలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నెహ్రూ పైవిధంగా ప్రకటించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎప్పుడో మూడున్నరేళ్ల తరువాత జరిగే ఎన్నికల కోసం నెహ్రూ ఇంత ముందుగా ప్రకటించడం చూస్తూంటే కచ్చితంగా ఏదో పెద్ద వ్యూహంతోనే ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నందున ఇక పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఆయన ఆంతరంగికులు చాలా కాలం నుంచే చెబుతున్నారు. రాజకీయాల నుంచి నెహ్రూ వైదొలగితే ఆ స్థానాన్ని ఆయన వారసుడైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ భర్తీ చేస్తారని చెప్పుకొస్తున్నారు. అయితే, పార్టీలో పట్టు నిరూపించుకునే వ్యూహంలో భాగంగానే పొలిటికల్ రిటైర్మెంట్‌పై నెహ్రూ యూ టర్న్ తీసుకుని ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
‘సానా’ గొడవలున్నాయి
సార్వత్రిక ఎన్నికల నుంచే జ్యోతుల, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మధ్య వర్గ వైషమ్యాలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు సీటును తన తనయుడు నవీన్‌కు దక్కించుకునేందుకు నెహ్రూ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఇదే సీటు కోసం చివరి వరకూ గట్టి ప్రయత్నం చేసిన సతీష్.. చినబాబు ఆశీస్సులతో నవీన్‌కు మోకాలడ్డారని బలమైన ప్రచారం జరిగింది. చివరకు ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఈ వివాదం సద్దు మణిగిందని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ, అది అక్కడితో సమసిపోలేదనే విషయం పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలకు జరిగిన ఎన్నికల్లో మరోసారి బయటపడింది. నవీన్‌కు పార్టీ జిల్లా పగ్గాలు రెండోసారి దక్కకుండా సానా వర్గం వ్యూహాలకు పదును పెట్టింది. ఆ వర్గం నుంచి మెట్ట ప్రాంతానికే చెందిన తోట నవీన్‌ను తెర మీదకు తీసుకు వచ్చారు. దీంతో, జిల్లా టీడీపీలో రెండు వర్గాలు కొనసాగుతున్నాయనే వాస్తవాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. జిల్లాలో చినబాబు అనుచరులుగా చలామణీ అవుతున్న పలువురు నేతలు అడ్డు పడినప్పటికీ.. నెహ్రూ తన చాణక్య నీతితో నవీన్ చేతుల నుంచి పార్టీ పగ్గాలు జారిపోకుండా తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. తన కుమారుడికి రెండోసారి జిల్లా పార్టీ పగ్గాలు దక్కించుకోగలిగారు.
ఈ ఎన్నిక ముందు వరకూ రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నారని ఆయన అనుచరులు చెబుతూ వచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ నెహ్రూ రాజకీయాల్లో కొనసాగుతారని, మరోసారి పోటీ చేస్తారనే చర్చను పార్టీలో వారు లేవనెత్తారు. దీనిని నిజం చేస్తూ రాజకీయాల నుంచి వెనక్కు తగ్గేదే లేదంటూ నెహ్రూ కుండ బద్దలుగొట్టారు. ఈ క్రమంలో కాస్త గొంతు పెంచి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ‘రాజకీయాల నుంచి వైదొలగాలనే మొదట్లో అనుకున్నాను. అయితే, ఇటీవల కాలంలో జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు రాజకీయాల నుంచి వైదొలగాలనే ఆలోచనను విరమించుకునేలా చేశాయి. రాజకీయాలంటే కొందరు ఆటలనుకుంటున్నారు. వెంట తిరిగే వారితో బాకా ఊదించుకోవడమనే ఆలోచనతో ఉంటున్నారు. వారికి రాజకీయాలంటే ఏమిటో చూపిస్తాను’ అంటూ నేతలు, కార్యకర్తల సమావేశంలో నెహ్రూ పదునైన వ్యాఖ్యలు చేశారు. తద్వారా భవిష్యత్తులో ప్రత్యర్థి వర్గానికి చుక్కలు చూపిస్తాననే సంకేతాలు ఇచ్చినట్లేనని ఆ పార్టీ నేతలు ప్రైవేటు సంభాషణల్లో అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నవీన్‌కు రెండోసారి దక్కకుండా చేసేందుకు ప్రత్యర్థి వర్గం చేసిన రాజకీయాలే దీనికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అసెంబ్లీయా.. పార్లమెంటా!
నెహ్రూ మరో అడుగు ముందుకేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నవీన్ కుమార్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీని అర్థం తాను పోటీ చేయనని చెప్పడం కాదని, జిల్లాలో ఎక్కడో ఒకచోట నుంచి తాను కూడా పోటీ చేస్తానని, 2029లో అసెంబ్లీలో అడుగు పెడతానని అన్నారు. అయితే, ఆయన అసలు లక్ష్యం అసెంబ్లీ కాదని, కాకినాడ లోక్‌సభ సీటు అని అంటున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికిప్పుడు బయట పెట్టకుండా వ్యూహాత్మకంగానే ఆయన ఈ ప్రకటన చేశారని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో దక్కించుకోలేని కాకినాడ లోక్‌సభ స్థానాన్ని వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా తన లక్ష్యాన్ని సాధించుకోవడం, అదే సమయంలో ప్రత్యర్థులకు స్థానం లేకుండా చేయడమనే ద్విముఖ వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం దక్కనీయకుండా గత ఎన్నికల్లో ఎత్తులు వేసి, నెహ్రూను చిత్తు చేసిన ఫార్ములానే వచ్చే ఎన్నికల్లోనూ ఫాలో అవుతామనే ధీమాతో ప్రత్యర్థి వర్గం ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లా టీడీపీలో రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.


