ప్రాధాన్యంలో ఆ రెండూ ఒక్కటే!
కపిలేశ్వరపురం: రెండేళ్ల ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రధానంగా మూడు విభాగాలుగా జరుగుతాయి. మొదటిగా నైతిక, మానవ విలువలు, పర్యావరణ విద్య అనే రెండు పరీక్షలు నిర్వహిస్తారు. రెండో విడతగా విద్యార్థి తీసుకున్న గ్రూపు ఆధారంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. చివరిగా వార్షిక థియరీ రాత పరీక్షతో ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా నైతిక, మానవీయ విలువలు పరీక్షతో బుధవారం మొదటి విడత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 23న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించనున్నారు. వాటి ప్రాధాన్యంపై ఈ కథనం.
పరీక్షలు రాసే మొదటి సంవత్సరం విద్యార్థులిలా..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 98,137 మంది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. వారిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 57,341 మంది బుధవారం నైతిక, మానవీయ విలువలు పరీక్ష రాయనున్నారు. కోనసీమ జిల్లాలో 123 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన 13,113 మంది ఈ పరీక్ష రాయనున్నారు. కాకినాడ జిల్లాలో 19 వేల మంది, తూర్పు గోదావరి జిల్లాలో 22,500 మంది, పోలవరం జిల్లాలో 2,728 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నారు.
థియరీకి 60 మార్కులు
ఇంటర్మీడియెట్ ఒకేషనల్, జనరల్ విభాగాల్లో ఎవరు ఏ గ్రూపు తీసుకున్నా ప్రథమ సంవత్సరంలోని ప్రతి విద్యార్థీ విధిగా నైతిక, మానవీయ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ పరీక్షలకు గైర్హాజరు అయినా, పరీక్ష తప్పినా ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ జారీ కాదు. ఒక్కో సబ్జెక్టులో 40 మార్కులకు ప్రాజెక్టు, 60 మార్కులకు థియరీ రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. 40 మార్కుల ప్రాజెక్టులో భాగంగా రికార్డు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. థియరీ 60 మార్కుల కోసం నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో సమాధానానికి 15 మార్కులు.
అధికారుల పర్యవేక్షణ
తూర్పు గోదావరి జిల్లా పరీక్షలను జిల్లా ఇంటర్‌బోర్డు రీజినల్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్ (ఆర్‌ఐఓ) ఐ.శారద పర్యవేక్షిస్తున్నారు. కోనసీమ జిల్లాలో డీఐఈఓ కె.చంద్రశేఖర్‌బాబు, కాకినాడ జిల్లాలో ఇన్‌చార్జి డీఐఈఓ కేశవరావు, పోలవరం జిల్లాలో డీఐఈఓ భీమశంకరరావు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఒకేషనల్, జనరల్ ఇంటర్మీడియెట్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సమావేశాలను ఏర్పాటు చేసి సూచనలు ఇచ్చారు.
పరీక్షల నిర్వహణ తీరు ఇలా..
ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జారీ చేసిన రిజిస్టర్ నంబర్లతో మాత్రమే పరీక్ష రాయాలి. గత విద్యా సంవత్సరాల్లో పరీక్షకు గైర్హాజరైన, పరీక్ష తప్పిన బ్యాక్‌లాగ్ విద్యార్థులు సైతం ప్రస్తుతం ఈ పరీక్షలు రాయొచ్చు. వారికి గతంలో జారీ అయిన రిజిస్టర్ నంబర్లతోనే పరీక్ష రాయాలి. పరీక్ష గదిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. థియరీ పరీక్షల మాదిరిగానే పరీక్ష కేంద్రాలను పర్యవేక్షణ బృందాలు సందర్శిస్తాయి. ప్రశ్న పత్రాలను ఇంటర్మీడియెట్ బోర్డు నిర్దేశిత వెబ్‌సైట్‌లో ఉంచుతారు. పరీక్ష రోజు ఉదయం 8 గంటలకు పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ సెల్ నంబర్‌కు పాస్‌వర్డ్ పంపుతారు. అలా నిర్దేశించిన ఐడీ, పాస్‌వర్డ్‌ల ద్వారా పరీక్ష కేంద్రంలో పేపర్‌ను డౌన్‌లోడ్ చేస్తారు. మరో నిర్దేశిత పాస్‌వర్డ్‌లు పొందడం ద్వారా పేపర్ ఓపెన్ అవుతుంది. దానిని ప్రింట్ తీసి విద్యార్థులకు అందజేస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం డీఐఈఓ కార్యాలయ అధికారులు నియమించిన అధ్యాపకులు పరీక్ష కేంద్రానికి వచ్చి, పేపర్లు దిద్దుతారు. విద్యార్థుల మార్కుల జాబితాను, పరీక్ష సమాధాన పత్రాలను ప్యాక్ చేసి, సీలు వేసి డీఐఈఓ కార్యాలయంలో అందజేస్తారు. ఇంతటి ప్రాధాన్యంగల ఈ పరీక్షకు ప్రతి విద్యార్థీ హాజరయ్యేలా కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సి ఉంది.
నేడు నైతిక, మానవీయ విలువలు పరీక్ష
హాజరు కానున్న
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు
గైర్హాజరైనా, పరీక్ష తప్పినా ఫెయిల్!
23న పర్యావరణ విద్యపై...
ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి
ప్రాధాన్యంలో ఆ రెండూ ఒక్కటే!


