క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం
ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం వంటి సద్గుణాలను ప్రబోధించిన దైవ కుమారుడైన ఏసు క్రీస్తు సిలువ మరణం పొందిన రోజును పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో సిలువ యాత్రలు నిర్వహించారు. అలనాడు క్రీస్తును ముళ్ల కొరడాలతో కొట్టి, రక్తం చిందింపజేసి.. సిలువ వేసిన సన్నివేశాలను కళ్లకు కట్టేలా ఈ యాత్రలు సాగాయి. నాడు క్రీస్తు అనుభవించిన బాధలను, శ్రమలను వీక్షకుల గుండెలు బరువెక్కే రీతిలో ప్రదర్శించారు. యాత్రల అనంతరం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్లు, పాస్టర్లు మాట్లాడుతూ, పాప మార్గంలో పయనిస్తున్న సమస్త మానవాళినీ రక్షించేందుకే.. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు సిలువపై ప్రాణ త్యాగం చేశారని అన్నారు. ఆయన త్యాగం ప్రపంచ మానవాళికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రతి ఒక్కరూ కరుణ, ప్రేమ, క్షమ, సహనం వంటి సద్గుణాలను అలవరచుకోవాలన్నదే క్రీస్తు సందేశమని తెలిపారు.
– కాకినాడ రూరల్/కరప
క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం


