ముగిసిన డ్రాగన్ పడవ పోటీలు
కొత్తపేట: కోనసీమ సంక్రాంతి సంబరాలు పేరిట ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద ప్రధాన పంట కాలువలో జరిగిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ – 2026 పడవ పోటీలు మంగళవారం ముగిశాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఏపీ పర్యాటక శాఖ పర్యవేక్షణలో గౌతమి – వశిష్ట నదుల మధ్య సెంట్రల్ డెల్టా ప్రధాన పంట కాలువలో మూడు రోజుల పాటు జరిగిన ఈ డ్రాగన్ బోటు పోటీలు, ఈత పోటీలు, అదే ప్రాంతంలో రంగవల్లులు, గాలిపటాల పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. మూడో రోజు పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ఫ్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.
బహుమతుల ప్రదానం
పోటీల ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన సభలో కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీ గంటి హరీష్ మాధుర్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల బుచ్చిబాబు, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్‌డీఓ పి.శ్రీకర్, రాష్ట్ర టీడీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు పాల్గొన్నారు.
డ్రాగన్ బోటు విజేతలు
డ్రాగన్ బోట్ ఫైనల్ 1000 మీటర్ల పోటీలో ఆరు టీమ్‌లు తలపడగా, బండారు (ఏలూరు), పల్నాడు, కోనసీమ అతి స్వల్ప తేడాలో గమ్యానికి చేరుకున్నాయి. 500 మీటర్ల విభాగంలో యర్రకాలువ, కర్నూలు, పల్నాడు టీమ్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
వెయ్యి మీటర్ల విజేతలకు వరుసగా రూ.2 లక్షలు, రూ.లక్ష, రూ.50 వేలు, అలాగే 500 మీటర్ల విజేతలకు రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలతో పాటు ట్రోఫీ, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
పతంగుల పోటీల్లో..
సీనియర్స్ పతంగుల పోటీల్లో ఆర్.చంటి (ఉచ్చిలి) ప్రథమ, టి.జస్వత్ ద్వితీయ స్థానం, బి.ప్రసాద్ (ఆత్రేయపురం) తృతీయ స్థానాల్లో నిలిచారు. జూనియర్స్ విభాగంలో డి.ఈశ్వర్ పవన్ (రాజమహేంద్రవరం), ఎం.పవన్ లోహిత్ (అంకంపాలెం), పి.కృష్ణ చైతన్య (కాకినాడ) తొలి మూడు స్థానాలు సాధించారు. రెండు విభాగాల విజేతలకు రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3 వేల చొప్పున అందజేశారు.
ముగిసిన డ్రాగన్ పడవ పోటీలు


