అతలాకోతలం | - | Sakshi
Sakshi News home page

అతలాకోతలం

Jan 14 2026 10:03 AM | Updated on Jan 14 2026 10:03 AM

అతలాక

అతలాకోతలం

ప్రమాదకరంగా అంతర్వేది సాగర సంగమం

గోదావరి వైపు పెరిగిన కోత

లైట్‌ హౌస్‌ వద్ద మలుపు అత్యంత ప్రమాదం

సఖినేటిపల్లి: సముద్రం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఆ తీరంలో సరదాగా గడపటానికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడతారు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. కానీ అదే సమయంలో తీరంలో ప్రమాదం పొంచి ఉంటుంది. ముఖ్యంగా అంతర్వేది సాగర సంగమం మృత్యుకుహరాన్ని తలపిస్తోంది. ఇక్కడ సముద్ర కెరటాల ప్రభావం కంటే శాంతంగా ఉండే గోదావరి లోతు మరింత ప్రమాదంగా మారింది. ఇటీవల ఈ మలుపును గుర్తించలేని ఓ యువకుడు తన వాహనంతో గోదావరిలో దిగబడి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అమావాస్య, పౌర్ణమి, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఆటుపోట్లుకు అటు సాగరం, ఇటు గోదావరి గర్భంలో వస్తున్న మార్పులకు సంగమం వద్ద లోతు అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.

కెరటాల ఉధృతి

రాజోలు దీవిలోని ఇతర సముద్ర తీర ప్రాంతాలకు భిన్నంగా అంతర్వేది వద్ద తీరం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే సముద్రం అలజడిగా ఉంటుంది. కానీ అంతర్వేది వద్ద మాత్రం ప్రకృతి వైపరీత్యాలతో పాటు, అమావాస్య, పౌర్ణమి ఘడియలకు ఉధృతంగా కనిపిస్తుంది. ఈ కెరటాల ఉధృతికి సంగమం వద్ద గోదావరిపై కూడా తీవ్ర ప్రభావం చూపడంతో కోత పెరుగుతోంది.

పొంచిఉన్న ప్రమాదం

అంతర్వేది సాగర సంగమం వద్ద భౌగోళికంగా ఏర్పడిన మలుపులో సముద్రం వైపు కెరటాల లోతు కంటే ప్రశాంతంగా ఉండే గోదావరి లోతు అత్యంత ప్రమాదకరంగా ఉంది. సంగమం వద్ద సముద్ర కెరటాల్లోకి ప్రమాదవశాత్తూ వెళ్లినా వెనక్కి రావచ్చు గానీ, గోదావరి ఒడ్డున ఒక్క అడుగువేస్తే చాలు ఇక ప్రాణాలు గాలిలో కలిసి పోయే ప్రమాదం పొంచి ఉందని మత్య్సకారులు తెలిపారు. ఇక్కడ అప్రమత్తంగా లేకపోతే అమాంతంగా సుమారు 8 అడుగుల లోతులోకి కూరుకుపోతామన్నారు. సముద్రంలో కంటే వశిష్ట గోదావరి అంచులో భారీగా చోటుచేసుకుంటున్న కోత ఎంతో ప్రమాదకరమని చెబుతున్నారు.

టెట్రాపోడ్స్‌ ఏర్పాటు చేయాలి

సాగర సంగమం వద్ద తీర రక్షణ వలయంగా టెట్రాపోడ్స్‌ (నాలుగు కాళ్లు ఉన్నట్టుగా కనిపించే ప్రత్యేక దిమ్మలు) ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో రక్షణకు, కోత నివారణకు వీటిని ఏర్పాటు చేస్తుంటారు. తీరంలో అలల శక్తిని విచ్ఛిన్నం చేసి, అలల తీవ్రతను ఇవి తగ్గిస్తాయి. అలాగే అలలు నేరుగా తీరాన్ని తాకకుండా చేసి, తీర రక్షణ గోడలుగా పనిచేస్తాయి. వీటి ప్రత్యేక ఆకారం వల్ల ఒకదానిపై ఒకటి బలంగా నిలబడి చలనం చెందకుండా ఉంటాయి. తుపానులు, భారీ అలలు వచ్చినప్పుడు కూడా స్థిరంగా నిలబడతాయి. పోర్టులు, హార్బర్లు, లైట్‌హౌస్‌లు, తీర ప్రాంతాల రక్షణకు ఉపయోగపడతాయి. సాధారణంగా వీటిని కాంక్రీట్‌తో తయారు చేస్తారు. దీర్ఘకాలంగా మన్నికగా కూడా ఉంటాయి.

పెరిగిన నీటి వడి

లైట్‌హౌస్‌ వద్ద తీరం ఒంపు తిరిగి ఉండడంతో నీటి ప్రవాహ వడి మరింత పెరిగింది. దీనివల్ల ఒడ్డున ఉన్న ఇసుక అనూహ్యంగా కొట్టుకుపోతోంది. గట్టున ఎంత లోతు ఉంటుందో అంతుచిక్కడం లేదు. దీని వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.

పోతాబత్తుల భాస్కరరావు, ఎంపీటీసీ, పల్లిపాలెం

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి

సాగర సంగమం వద్ద పొంచి ఉన్న ప్రమాదంపై భక్తులు, పర్యాటకులకు తెలిసేలా హెచ్చరిక బోర్డులను లైట్‌ హౌస్‌ వద్ద ఏర్పాటు చేయాలి. చీకటి పడే సమయంలో కూడా డేంజర్‌ సిగ్నల్స్‌ ఉండేలా చూడాలి. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఒకరిని రక్షించగలిగాం. మరొకరు కారుతో పాటు 8 అడుగుల లోతులోకి వెళ్లిపోయి చనిపోయారు.

మహేష్‌, అంతర్వేదిపాలెం

వైవిధ్యానికి కారణాలివే..

అంతర్వేది వద్ద తీరం వైవిధ్యంగా ఉండటానికి పలు కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి రోజూ పోటు సమయంలో సముద్రం నీరు గోదావరి వైపునకు పోటెత్తడం, దానికి ఎగువ ప్రాంతాల నుంచి చిట్టచివరనున్న అంతర్వేదికి చేరే గోదావరి నీటి ప్రవాహం తోడవ్వడంతో ఆ సమయంలో నీటి మట్టం రెట్టింపు అవుతోంది.

సముద్ర గర్భంలో అప్పటికప్పుడు వచ్చే మార్పులకు సముద్రం నీరు బిగపెట్టడం(సంగమం వద్ద గోదావరి నీరు సముద్రంలోకి రానీయకుండా), ఆ సమయంలో గోదావరి ప్రవాహం దిశ మళ్లి అంచులో కోత పెరుగుతోంది.

విపత్తుల సమయాల్లో, భౌగోళికంగా వచ్చే మార్పులకు సంగమానికి పశ్చిమ వైపు బియ్యపుతిప్ప గ్రామం వద్ద ఇసుక దిబ్బలు వేస్తున్నాయి. దీంతో కెరటాల ఉధృతికి సంగమానికి రెండో వైపు ఉన్న అంతర్వేది తీరానికి ఉధృతి ఎక్కువవుతోంది.

అంతర్వేది లైట్‌హౌస్‌ వద్ద తీరం ఎక్కువ నిడివి మలుపు తిరిగి ఉండడం, సంగమానికి పశ్చిమ వైపు కంటే తూర్పువైపు ఉన్న అంతర్వేది వద్ద నీటి ప్రవాహ వేగం తీవ్ర స్థాయిలో ఉండడంతో ఒడ్డు కోత కూడా అదే రీతిలో అధికంగా ఉంటోంది.

పశ్చిమం వైపున దిబ్బలు

సాగర సంగమానికి పశ్చిమం వైపున ఉన్న బియ్యపుతిప్ప వద్ద సముద్రం ఇసుక దిబ్బలు వేస్తోంది. ఆ కారణంగా తూర్పువైపున నీటి ప్రవాహ వేగం పెరుగుతోంది. సముద్రం పోటు నీటికి, గోదావరి ప్రవాహం తోడవ్వడంతో తీరం వెంబడి కోత తీవ్ర రూపం దాల్చుతోంది.

– కొల్లాటి నరసింహస్వామి, మాజీ సర్పంచ్‌, పల్లిపాలెం

అతలాకోతలం1
1/6

అతలాకోతలం

అతలాకోతలం2
2/6

అతలాకోతలం

అతలాకోతలం3
3/6

అతలాకోతలం

అతలాకోతలం4
4/6

అతలాకోతలం

అతలాకోతలం5
5/6

అతలాకోతలం

అతలాకోతలం6
6/6

అతలాకోతలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement