మద్యం తాగి రత్నగిరి ఉద్యోగి సస్పెన్షన్
అన్నవరం: రత్నగిరిపై రవాణా విభాగం ఉద్యోగి ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్న విషయం మరువక ముందే తొలి పావంచా వద్ద స్వామివారి ప్రసాదం కౌంటర్‌లో ఉద్యోగి పసుపులేటి సుబ్బారావు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నట్టు బ్రీత్ అనలైజర్ పరీక్షలో దొరికిపోయాడు. దీంతో ఈఓ వీర్ల సుబ్బారావు అతడిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి పది గంటల సమయంలో ఒక భక్తురాలు స్వామివారి ప్రసాదం కొనుగోలు చేయడానికి ఆ కౌంటర్ వద్దకు వచ్చారు. రూ.200 ఇచ్చి ఐదు ప్యాకెట్లు ఇవ్వాలని ఆ మేరకు టోకెన్లు ఇచ్చారు. ఐదు ప్యాకెట్ల విలువ రూ.వంద పోను మిగిలిన రూ.వంద ఇవ్వాల్సి ఉండగా సదరు ఉద్యోగి ఆమెకు దురుసుగా సమాధానం ఇచ్చారు. అతని మాటతీరు, ప్రవర్తనపై ఆమె ఈఓకు ఫిర్యాదు చేశారు. ఆయన సెక్యూరిటీ గార్డులతో కలసి వచ్చి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసి మద్యం తాగినట్టు గుర్తించి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.


