ఫీల్డ్ అసిస్టెంట్ల పోరుబాట
● అధికారులకు సమ్మె నోటీసు
● పది రోజుల్లో సమస్యలు
పరిష్కరించాలని డిమాండ్
● లేకుంటే విధులు బహిష్కరిస్తామని అల్టిమేటం
పిఠాపురం: అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చి.. తీరా గద్దెనెక్కాక వాటిని కూటమి సర్కార్ నెరవేర్చకపోవడంతో వివిధ వర్గాలు ఇప్పటికే ఆందోళన బాట పడుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా వచ్చి చేరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే విధులు బహిష్కరిస్తామని జిల్లావ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న 385 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తమ ఆందోళనలో భాగంగా గురువారం నుంచి నిరసన కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తమ సమస్యలను కూటమి సర్కార్ పరిష్కరించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి చేపట్టినా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 28వ తేదీలోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి, సమ్మె బాట పడతామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చారు.
ఇవీ డిమాండ్లు
● 19 ఏళ్ల సర్వీసును గుర్తించి, ఫీల్లు అసిస్టెంట్లందరినీ గ్రామ పంచాయతీ ఉద్యోగులుగా గుర్తించి, విధులు క్రమబద్ధీకరించాలి.
● అందరికీ ఎఫ్‌టీఈ ఇచ్చి, పూర్తి స్థాయి హెచ్‌ఆర్ పాలసీ, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, గ్రాట్యుటీ వంటివి అమలు చేయాలి.
● విధి నిర్వహణలో మృతి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలి. మరణ పరిహారంగా రూ.10 లక్షలు చెల్లించాలి.
● 2016–19 మధ్య ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు జీతాలు పెంచారు. కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లకు పెంచలేదు. అదే నిష్పత్తిలో మాకూ పెంచాలి.
● విద్యార్హతల ఆధారంగా పదోన్నతులు ఇచ్చి, అర్హతలున్న వారిని కంప్యూటర్ ఆపరేటర్లుగా, టెక్నికల్ అసిస్టెంట్లుగా నియమించాలి.
ఇదీ ఉద్యమ కార్యాచరణ
తొలుత నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతారు. సమ్మె నోటీసు ఇస్తారు. ఈ నెల 21న ఒక రోజు పనులు పూర్తిగా ఆపేసి, పెన్‌డౌన్ చేస్తారు. సమ్మె విషయం తెలియజేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తారు. ఈ నెల 28 నుంచి విధులు పూర్తిగా బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తారు. ఫీల్డు అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా సంఘం ఈ మేరకు నిర్ణయించింది. ఇప్పటికే వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ నిరసన ప్రారంభించారు.
సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం
దీర్ఘ కాలంగా ఉన్న మా సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాడతాం. మాకు న్యాయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కానీ మాకు నిరాశే మిగిలింది. అందుకే వేరే దారి లేక ఉద్యమానికి వెళ్తున్నాం. మేము ఇచ్చిన గడువులోగా డిమాండ్లు నెరవేరకపోతే నిరవధిక సమ్మె చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికై నా మా సమస్యలు పరిష్కరించి, న్యాయం చేయాలి.
– కడమటి శ్రీనివాసరావు,
జిల్లా అధ్యక్షుడు, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం
డిమాండ్లు నెవేర్చాలి
న్యాయబద్ధంగా రావాల్సిన వాటినే మేము అడుగుతున్నాం. వాటిని ప్రభుత్వం నెరవేర్చాలి. లేకుంటే సమ్మె తప్ప మాకు వేరే మార్గం లేదు. మా సమస్యలు పరిష్కరిస్తారని ఇప్పటి వరకూ వేచి చూశాం. కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు పిలుపునిచ్చాం. ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కరించి, సమ్మెకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి.
– గుబ్బల సత్యవేణి,
జిల్లా కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం
ఫీల్డ్ అసిస్టెంట్ల పోరుబాట
ఫీల్డ్ అసిస్టెంట్ల పోరుబాట


