కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన
● మెయిన్స్ పరీక్ష తేదీలు
ప్రకటించాలని డిమాండ్
● కలెక్టరేట్ వద్ద ధర్నా
కాకినాడ సిటీ/కాకినాడ క్రైం: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, వెంటనే స్పందించి, కోర్టు కేసులు క్లియర్ చేసి, మెయిన్స్ పరీక్షల తేదీలు ప్రకటించాలని, లేకుంటే చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న హెచ్చరించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యాన కాకినాడలో గురువారం ధర్నా నిర్వహించారు. తొలుత స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, గత ప్రభుత్వం 2022 నవంబర్ 28న 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. జనవరిలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 4.52 లక్షల మంది హాజరయ్యారన్నారు. వీరిలో 92 వేల మంది అర్హత సాధించారని, రెండేళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారని చెప్పారు. దీనిపై వెంటనే కోర్టు కేసులు పరిష్కరించి, మెయిన్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. ఇప్పటికే పోలీసు శాఖలో 20 వేల వరకూ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి సంగతేమిటని ప్రశ్నించారు. మూడేళ్లుగా నిరుద్యోగులు కోచింగ్ ఫీజులు, రూము అద్దెలు చెల్లించలేక, పుస్తకాలు కొనలేక, భార్యను, కుటుంబాన్ని వదిలేసి చదువుకుంటూంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని ఆందోళనకారులు దుయ్యబట్టారు. యువగళంలో లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ గొంతు.. అధికారంలోకి రాగానే మూగబోయిందని విమర్శించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ పీడీ ప్రసాద్, జిల్లా నాయకుడు టి.రాజా మాట్లాడుతూ, నిరుద్యోగ యువతతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. పది నెలల్లో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వందలాదిగా కానిస్టేబుల్ అభ్యర్థులు పాల్గొన్నారు.


