నగదు రహిత పాదయాత్రకు స్వాగతం
ఆదిత్య పూర్వ విద్యార్థికి అభినందనలు తెలిపిన యాజమాన్యం
గండేపల్లి: ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలను సందర్శించి, 27 రాష్ట్రాలను చుట్టి వచ్చిన ఆదిత్య పూర్వ విద్యార్థికి కళాశాలల యాజమాన్యం సాదర స్వాగతం పలికింది. సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో 2019 నుంచి 2023 వరకు పెట్రోలియం టెక్నాలజీ ఇంజినీరింగ్ విభాగంలో విద్యనభ్యసించిన తమిళనాడు రాష్ట్రం కుంభకోణంకు చెందిన ఎస్.తిలోత్తమన్ సంపూర్ణ భారతదేశ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించి గురువారం కళాశాలలకు చేరుకుని చాన్సలర్ ఎన్.శేషారెడ్డి, ప్రో చాన్సలర్ ఎన్.సతీష్‌రెడ్డిని కలిసి తాను చేస్తున్న పాదయాత్ర గురించి వివరించాడు. ఈ సందర్భంగా తిలోత్తమన్ మాట్లాడుతూ నవంబర్ 11, 2024 న కుంభకోణంలో పాదయాత్రను ప్రారంభించానని, ఈ యాత్ర పూర్తి నగదు రహిత పాదయాత్ర అని కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మార్గమధ్యలో ఎవరినైనా లిఫ్ట్ అడిగి ప్రయాణిస్తున్నట్టు తెలియజేశాడు. ఆయా ప్రాంతాలలో ఆలయాలు, వసతి సత్రం, అన్నదాన కేంద్రాల వద్ద ఆహారం తీసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నట్టు పేర్కొన్నాడు. యువత మత్తుకు అలవాటుపడి వారి భవిష్యత్‌ను నాశనం చేసుకోవడం, కుటుంబాలు చిన్నాభిన్నం అవడం చూశానని, ఈ యాత్ర యువతపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ప్రారంభించినట్టు తెలిపాడు. కుంభకోణంలో ఏప్రిల్ నెలాఖరున సంపూర్ణ భారతదేశ పాదయాత్రను పూర్తిచేయనున్నట్టు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా డిప్యూటీ ప్రో చాన్సలర్ ఎం.శ్రీనివాసరెడ్డి, వైస్ చాన్సలర్ ఎంబీ శ్రీనివాస్, ప్రో వైస్ చాన్సలర్ ఎస్.రమాశ్రీ, డీన్స్ తిలోత్తమన్‌ను అభినందించారు.
వాడపల్లి వెంకన్నకు రూ.1.23 కోట్ల ఆదాయం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల ద్వారా రూ.1.23 ఆదాయం వచ్చినట్టు దేవాదాయ –ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 31 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో గురువారం హుండీలను తెరిచి నగదు, మొక్కుబడులను లెక్కించారు. ప్రధాన హుండీల నుంచి రూ.96.99,132, అన్న ప్రసాదం హుండీల నుంచి రూ.23,27,304, బంగారం 10 గ్రాములు, వెండి 1 కేజీ 925 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 20 వచ్చినట్టు వివరించారు. ఆలయ క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి ఆలయ హుండీల ద్వారా రూ 2,99,236 ఆదాయం లభించిందన్నారు. దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఇన్‌స్పెక్టర్ టీవీఎస్‌ఆర్ ప్రసాద్, గోపాలపురం గ్రూపు దేవాలయాల గ్రేడ్ – 3 ఈఓ బీ కిరణ్, ఆత్రేయపురం గ్రూపు దేవాలయాలు గ్రేడు – 3 ఈఓ బీ నరేంద్రకుమార్, దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, ఉప సర్పంచ్ పోచిరాజు బాబూరావు పాల్గొన్నారు.
నల్లజర్ల: దూబచర్ల గాంధీ కాలనీ, ముసుళ్ళగుంటలలో అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు చెప్పుల దండలు వేసి అవమానించిన కేసులో సమగ్ర విచారణ జరిపి నిజమైన దోషులను పోలీస్‌లు అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ డిమాండ్ చేసింది. గురువారం సాయంత్రం నల్లజర్లలో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలివేణు మాట్లాడుతూ ఈ విగ్రహాల విషయంలోఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఒత్తిళ్లకు లొంగి పోలీసులు సమగ్ర విచారణ జరపకుండానే వైఎస్సార్ సీపీ అభిమాని, సామాజిక కార్యకర్త బుడుపుల బాబ్జిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. టీడీపీ వైఎఎస్సార్ సీపీపై బురదజల్లే కార్యక్రమం చేపట్టిందన్నారు. మా ఆరాధ్యధైవం అంబేద్కర్‌ను ఎందుకు అవమానిస్తామని ప్రశ్నించారు. ఏదో విధంగా కేసు త్వరితగతిన పూర్తి చేయడానికి పోలీసులు ఈవిధంగా వ్యవరించారన్నారు. ఇక్కడ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందా అని ప్రశ్నించారు. 2024 నవంబరు 26న ద్వారకాతిరుమలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసు ఇంతవరకు ఏమైందో తెలియలేదన్నారు. ఈ కేసులో నిర్ధోషి, దళిత యువకుడు గోపాలపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాకులపాటి శ్రీనివాస్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు అందుగుల వెంకటేశ్వరావు, ముప్పిడి వెంకటరత్నం, తాడిగడప శ్రీనివాసరావు, బోడిగడ్ల రాంబాబు, తోట వెంకట్రావు, గోగులమండ రాజారావు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న నాయకులు


