కానుకలో 8 రకాల వస్తువులు | - | Sakshi
Sakshi News home page

కానుకలో 8 రకాల వస్తువులు

May 22 2024 12:45 AM | Updated on May 22 2024 12:45 AM

కానుక

కానుకలో 8 రకాల వస్తువులు

రెండు మూడు రోజుల్లో..

ఇండెంట్‌ పెట్టిన అన్ని వస్తువులూ రెండు మూడు రోజుల్లో జిల్లాకు చేరనున్నాయి. అన్ని వస్తువులనూ మండల కేంద్రాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత కిట్‌గా తయారు చేసి, పాఠశాలలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలు తెరిచే నాటికి వీటిని పంపిణీ చేసేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇప్పటికే పాఠ్య, నోట్‌ పుస్తకాలు అన్ని రకాల వచ్చాయి. మిగిలినవి రెండు మూడు రోజుల్లో వస్తాయి.

– చామంతి నాగేశ్వరరావు,

సీఎంఓ, సమగ్ర శిక్ష అభియాన్‌

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): పాఠశాలలు పునఃప్రారంభించే సమయానికి ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్య పుస్తకం ఉంచేందుకు పాఠశాల విద్యాశాఖ మార్చి నుంచే చర్యలు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాల పంపిణీలో ఎటువంటి పొరపాట్లకూ తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు దఫాలుగా జగనన్న విద్యా కానుకను విజయవంతంగా, నాణ్యతతో విద్యార్థులకు అందజేశారు. అదే ఒరవడిలో పాఠశాల ప్రారంభం రోజునే పాఠ్య, నోట్‌ పుస్తకాలతో పాటు యూనిఫాం, బెల్టులు, బూట్లు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, బ్యాగ్‌తో కూడిన విద్యాకానుక కిట్లు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యా శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే జిల్లాలో గుర్తించిన స్టాక్‌ పాయింట్లలో జగనన్న విద్యాకానుక వస్తువులను నిల్వ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్తగా అడ్మిషన్లు పొందిన వారికి సైతం తొలి రోజే కానుక పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ముద్రణ, సరఫరా ప్రారంభించారు. పాఠ్య, నోట్‌ పుస్తకాలను ఏప్రిల్‌లోనే జిల్లా గోదాముకు చేర్చడం ప్రారంభించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకూ ప్రతి పాఠ్య పుస్తకం కవర్‌ పేజీలో మార్పులు చేసి, విద్యార్థిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. పాఠ్య పుస్తకంలో క్యూఆర్‌ కోడ్‌ కూడా ముద్రించారు. దీని ద్వారా పాఠ్యాంశానికి సంబంధించిన అదనపు సమాచారం పొందవచ్చు.

111 టైటిల్స్‌ పాఠ్య పుస్తకాలు

పుస్తకాల బరువుతో విద్యార్థుల వెన్నెముకపై భారం పడకుండా ఉండేందుకు దశల వారీగా సెమిస్టర్‌ విధానాన్ని అమలు చేశారు. గత విద్యా సంవత్సరంలో 1 నుంచి 9వ తరగతి వరకూ ఈ విధానం అమలు చేయగా, ఈ ఏడాది పదో తరగతికి కూడా అమలు చేశారు. గణితం, సైన్స్‌ సబ్జెక్టులను రెండు సెమిస్టర్లుగా విడదీశారు. సిలబస్‌ మొత్తాన్ని జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకూ సెమిస్టర్‌–1, నవంబర్‌ నుంచి మార్చి వరకు సెమిస్టర్‌–2గా విభజించారు. 1 నుంచి 10 తరగతుల పాఠ్య పుస్తకాలను బైలింగ్వల్‌ విధానంలో ముద్రించారు. ఒక పేజీలో ఇంగ్లిషు, మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాన్ని ముద్రించి ఇవ్వడం వల్ల విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుని చదువుకునే వీలుంటుంది. 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు 111 టైటిల్స్‌ పాఠ్య పుస్తకాలు సరఫరా చేస్తున్నారు.

రెండు విధాలుగా..

గత విద్యా సంవత్సరం వరకూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ధవళేశ్వరంలో ఉన్న పుస్తకాల గోదాముకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ప్రింటింగ్‌ ప్రెస్‌ల ద్వారా పాఠ్య పుస్తకాలు సరఫరా చేసేవారు. అక్కడి నుంచి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకూ పంపిణీ చేసేవారు. అయితే ఈసారి పాఠ్య పుస్తకాలను రెండు విధాలుగా సరఫరా చేస్తున్నారు. 1 నుంచి 7 తరగతులకు నేరుగా పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లను పుస్తక గోదాము నుంచి మండల స్టాక్‌ పాయింట్లకు పంపిస్తున్నారు. 8 నుంచి 10 తరగతులకు ప్రభుత్వ అనుమతి పొందిన ప్రింటింగ్‌ ప్రెస్‌ల నుంచి నేరుగా మండల స్టాక్‌ పాయింట్లకు సరఫరా చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 21 మండల కేంద్రాల్లో స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 1 నుంచి 7 తరగతులకు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు 14,97,436 పుస్తకాలు సరఫరా కావాల్సి ఉండగా, 6,54,000 సరఫరా అయ్యాయి. అక్కడి నుంచి ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా మండల స్టాక్‌ పాయింట్లకు సరఫరా కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మండల స్టాక్‌ పాయింట్లకు 8 నుంచి 10 తరగతుల పాఠ్య పుస్తకాల సరఫరా ప్రారంభమైంది.

ఫ రెడీ అవుతున్న జగనన్న విద్యా కానుక

ఫ ఇప్పటికే జిల్లాకు చేరిన

9,45,652 నోట్‌ పుస్తకాలు

ఫ 30 శాతం వరకూ వచ్చిన

పాఠ్య పుస్తకాలు

ఫ ఒకటి రెండు రోజుల్లో

మిగిలిన వస్తువుల రాక

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్‌ పొందే విద్యార్థి చదువుకు అవసరమయ్యే అన్ని రకాల సామగ్రినీ ఉచితంగా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. విద్యార్థులకు అందిస్తున్న జగనన్న విద్యా కానుక కిట్‌లో 8 రకాల వస్తువులు ఉంటాయి. మూడు జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, ఇంగ్లిష్‌ డిక్షనరీ, ఒక బెల్ట్‌, బూట్లు, రెండు జత సాక్స్‌ బ్యాగ్‌లో పెట్టి విద్యార్థులందరికీ అందించనున్నారు. జిల్లాకు సంబంధించి 9,45,652 నోట్‌ పుస్తకాలకు ఇండెంట్‌ పెట్టగా 100 శాతం జిల్లాకు చేరుకున్నాయి. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 6,50,366 పాఠ్య పుస్తకాలకు ఇండెంట్‌ పెట్టగా వీటిలో 30 శాతం ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. బెల్టులు 90,896, బూట్లు 1,38,074, బ్యాగులు 1,38,074, యూనిఫాం 1,38,074, వర్క్స్‌ బుక్స్‌ 1,80,300, డిక్షనరీలు 6,820, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు 15,983 త్వరలో రానున్నాయి. కానుకలోని అన్ని వస్తువులనూ మండల కేంద్రాల్లో ఒకచోట ఉంచి, నాణ్యతను ముందుగానే తనిఖీ చేసి, బ్యాగుల్లో పెట్టి కిట్‌ రూపంలో సిద్ధం చేయడానికి సీఆర్‌పీలను వినియోగిస్తున్నారు. ఈ విధులు నిర్వహించే వారికి అదనపు రుసుం చెల్లించనున్నారు.

కానుకలో 8 రకాల వస్తువులు 1
1/2

కానుకలో 8 రకాల వస్తువులు

కానుకలో 8 రకాల వస్తువులు 2
2/2

కానుకలో 8 రకాల వస్తువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement