అలంపూర్: నియోజకవర్గంలో సాగునీటి సమస్యల ను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరా బాద్‌లో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీయర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అలంపూర్ మండలంలోని ఉట్కూర్–1, 2, క్యాతూర్–1, 2 ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 8 ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి తీగలు, ఆయిల్‌ను దుండగులు ఎత్తుకెళ్లడంతో ఆయా పథకాలు పని చేయడం లేదన్నారు. ఫలితంగా కృష్ణానదిలో నీరు ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎత్తిపోతలు ప్రారంభించడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 10 వేల ఎకరాలకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులకు సాగునీటిని అందించడానికి కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయాలని, అలాగే నెట్టెంపాడు పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు.


