పోలియోను నిర్మూలిద్దాం | - | Sakshi
Sakshi News home page

పోలియోను నిర్మూలిద్దాం

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి రెండు చుక్కలు

నేటి నుంచి పల్స్‌పోలియో

అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన వైద్యారోగ్యశాఖ

జిల్లాలో 69,383

మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని లక్ష్యం

గద్వాల క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే వ్యాక్సినేటర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు పోలియో వ్యాక్సిన్‌ను పీహెచ్‌సీలు, ఉప కేంద్రాలకు చేరవేసింది. జిల్లాలో ఐదేళ్లలోపు వయసు కలిగిన 69,383 మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మొదటి రోజు పల్స్‌పోలియో కేంద్రాల వద్ద చుక్కల మందు వేయనున్నారు. సోమ, మంగళవారాల్లో 1,38,219 గృహాలను సందర్శించి, మిగిలిపోయిన పిల్లలకు చుక్కల మందు వేసేలా ప్రణాళికలు రూపొందించారు.

471 కేంద్రాల ఏర్పాటు..

జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 91 సబ్‌ సెంటర్స్‌, ఒక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, ఏరియా ఆస్పత్రి, 3 అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల పరిధిలో మొత్తం 471 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 4,085 వ్యాక్సిన్‌ వాయిల్స్‌ రాగా.. జిల్లాను 53 రూట్లుగా విభజించి, 45మంది పర్యవేక్షకులను నియమించారు. 15 మొబైల్‌ బృందాలు, 1,884 మంది వ్యాక్సినేటర్లు, 471 మంది ఏఎన్‌ఎంలు, 300 మంది ఆశలు, మరో 400 మంది వలంటీర్లు పోలియో చుక్కల మందు పంపిణీలో పాల్గొననున్నారు. ప్రతి సెంటర్‌లో ఉదయం 7గంటల నుంచి చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఆశావర్కర్లే ఇంటికి వచ్చి చుక్కల మందు వేస్తారని చాలా మంది తల్లులు నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతి చిన్నారిని పోలియో బూత్‌ వద్దకు తీసుకెళ్లి చుక్కల మందు వేయించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చిన్నారులకు భవిష్యత్‌లో ఎలాంటి శారీరక వికలత్వం రాకుండా ఉండేందుకు పల్స్‌పోలియో వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

నిర్లక్ష్యం వద్దు..

పోలియో రహిత జిల్లాగా..

జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కల మందు పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రతి పట్టణ, గ్రామంలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కల మందు వేయించాలి. పోలియో రహిత జిల్లాగా మార్చడమే జిల్లా వైద్యారోగ్యశాఖ లక్ష్యం.

– సంధ్యా కిరణ్మయి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement