పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న జిల్లా జడ్జి | - | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న జిల్లా జడ్జి

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

అలంపూర్‌(అలంపూర్‌ రూరల్‌)/ఎర్రవల్లి: జిల్లాలోని అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి, బీచుపల్లి అభయాంజనేయస్వామి క్షేత్రాలను శనివారం జిల్లా జడ్జి కళ్యాణ్‌ చక్రవర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అర్చక స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వాదం పలికారు. జిల్లా జడ్జి వెంట జూనియర్‌ సివిల్‌జడ్జి వెంకటేశ్‌ ధ్రువ, అలంపూర్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌జడ్జి మిథున్‌ తేజ, ఎస్‌ఐ రామకృష్ణ, జూనియర్‌ అసిస్టెంట్‌ చిన్నరాజు, అర్చకుడు అనిల్‌శర్మ ఉన్నారు.

అందుబాటులో యూరియా

అలంపూర్‌(అలంపూర్‌ రూరల్‌): జిల్లాలో రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచుతున్నట్లు డీఏఓ వీరప్ప అన్నారు. శనివారం అలంపూర్‌ పట్టణంతో పాటు భీమవరం, కోనేరు గ్రామాల్లోని ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల స్టాక్‌తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలంపూర్‌ మండలంలో ప్రస్తుతం 1,350 బస్తాల యూరియా అందుబాటులో ఉందన్నారు. యాప్‌లో బుక్‌ చేసుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఫర్టిలైజర్‌ డీలర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తనాలు, ఎరువులు విక్రయించాలని సూచించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఏఓ వెంట ఇన్‌చార్జి ఏడీఏ సుబ్బారెడ్డి, ఏఓ నాగార్జున్‌రెడ్డి ఉన్నారు.

వేరుశనగ క్వింటా రూ.6,841

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 1,339 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 6,841, కనిష్టంగా రూ. 3,556, సరాసరి రూ. 5,600 ధరలు పలికాయి. అదే విధంగా 2 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. రూ. 4,811 ధర వచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement