గద్వాల: ప్రతి ఇంటికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందించి.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అధికారులకు సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని 22, 23 వార్డుల్లో బీఎల్‌ఓలు చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా పూరించాలో ఓటర్లకు స్పష్టంగా వివరించాలని సూచించారు. అదే విధంగా ఫారాలు ఇచ్చేటప్పుడు ఓటర్ల అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని తప్పులు లేని సమగ్ర ఓటరు జాబితాను రూపొందించాలని ఆదేశించారు. అదే విధంగా 18ఏళ్లు నిండిన అర్హులైన వారిని ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేయించాలన్నారు. మరణించిన వారి పేర్లు, డబుల్ నమోదులు, ఇతర సవరణల కోసం ఫారం–7 వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వాములు కావాలని తెలిపారు.


