కూరగాయల రైతుకు లభించని రాయితీలు
● ఏటేటా పెరుగుతున్న పెట్టుబడులు
● ఎకరా విత్తనాల కోసమే రూ.7వేల వరకు వ్యయం
● అటకెక్కిన ఆర్‌కేవీవై పథకం
గద్వాల వ్యవసాయం: కూరగాయల రైతుకు తిప్పలు తప్పడం లేదు. పెరుగుతున్న పెట్టుబడులతో సతమతమవుతున్న రైతులకు విత్తనాల ధరలు మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) పథకం కింద ఈ ఏడాదైనా రాయితీపై కూరగాయల విత్తనాలు, ట్రేలు లభిస్తాయన్న ఆఽశ ఉండేది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 10వేల ఎకరాల్లో..
జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నాయి. వాతావరణం సైతం సాధారణంగానే ఉంటుంది. దీంతో ఇక్కడ రైతులు సాధారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా విస్తారంగా పండిస్తారు. రెండు సీజన్‌లతో కలిపి దాదాపు 10వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ.. ధరూర్ మండలంలో బెండ, టమాటా.. మల్దకల్ మండలంలో చిక్కుడు, టమాటా, బీర, సోరకాయ, బెండ, కాకర.. అయిజలో బెండ, చిక్కుడు.. వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లి.. అలంపూర్‌లో ఉల్లి.. రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా.. గట్టు, కేటీదొడ్డి మండలాల్లో టమాటాతో పాటు ఆకుకూరలు సైతం పండిస్తున్నారు.
రాయితీపై నారా అందిస్తున్నాం..
ఆర్‌కేవీవై ద్వారా రాయితీపై కూరగాయల విత్తనాలు, ట్రేలు రావడం లేదు. అయితే హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతంలోని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రంలో రాయితీపై టమాటా, వంకాయ తదితర కూరగాయల నారు అందిస్తున్నాం.
– ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి


