గద్వాల క్రైం: జిల్లాలో ఈ నెల 28 నుంచి పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి సంధ్యా కిరణ్మయి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 69,383 మంది చిన్నారులను గుర్తించామని.. వారికి చుక్కల మందు వేసేందుకు 471 పోలియో బూత్‌లను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వర కు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించి, పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
గచ్చిబౌలికి బస్సు సర్వీసు
గద్వాల క్రైం: జిల్లాకేంద్రం నుంచి గచ్చిబౌలికి ప్రత్యేకంగా బస్సు సర్వీసు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజు ఉదయం 4గంటలకు బస్సు ప్రారంభమై కర్నూలుకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 5:30 గంటలకు బయలుదేరి.. అలంపూర్ క్రాస్‌రోడ్డు, ఎర్రవల్లి, పెబ్బేరు, వనపర్తి మీదుగా గచ్చిబౌలికి చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పీసీసీ పార్లమెంట్
కో–ఆర్డినేటర్ల నియామకం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పార్టీపరంగా పర్యవేక్షించేందుకు గాను పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కంట్రోల్ రూం కో–ఆర్డినేటర్లను నియమిస్తూ తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒబేదుల్లా కొత్వాల్, మహబూబ్‌నగర్‌కు టి.రేవతిగౌడ్ నియమితులయ్యారు.
ఓబీసీ, ఎస్పీ మోర్చా అధ్యక్షుల నియామకం
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా అధ్యక్షులను నియమి స్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ఉత్తర్వు లు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పి.యాదయ్య, వనపర్తి కొమ్ము శ్రీను, నాగర్‌కర్నూల్ జెట్టి వెంకటేష్‌ను నియమించారు. అలాగే మహబూబ్‌నగర్ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మిట్టమీది నాగరాజు, వనపర్తి జిల్లాకు ప్రవీణ్, నాగర్‌కర్నూల్ జిల్లాకు భూషయ్య, గద్వాల జిల్లా ఆంజనేయులును నియమించారు.
దీర్ఘకాలిక ఉద్యాన సాగుపై పరిశోధనలు చేయాలి
కొత్తకోట రూరల్: ఉద్యాన కళాశాల విద్యా ర్థులు ఉసిరి, చింత, నేరేడు వంటి దీర్ఘకాలిక ఉద్యాన పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. వనపర్తి జిల్లాలోని మోజర్లలో ఉన్న ఉద్యాన కళాశాల 19వ వార్షికోత్సవాన్ని గురువారం రాత్రి నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన సాగు కు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల మార్పిడీ విధానాన్ని అనుసరిస్తూ ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన విభాగం డీన్ డా. జె.చీనానాయక్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ఉన్నత ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంఎస్సీ చదివే లక్ష్యంతో విశ్వవిద్యాలయ పరిధిలో జేఆర్‌ఎఫ్ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ వీణాజ్యోషి పాల్గొన్నారు.
రెండ్రోజులకే నిలిచిన
నీటి పంపింగ్
మరికల్: జూరాల నుంచి కోయిల్‌సాగర్‌కు నీటి పంపింగ్ రెండురోజులకే నిలిచిపోయింది. గత వారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చిన్నచింతకుంట మండలం ఉంద్యాల స్టేజీ–1 దగ్గర జూరాల నీటి పంపింగ్‌ను ప్రారంభించి రెండురోజుల పాటు పర్ధీపూర్ చెరువుకు చేపట్టారు. పర్ధీపూర్ చెరువు నిండి కోయిల్‌సాగర్‌కు నీళ్లు రావాలి. ఆ చెరువు నిండటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. కొన్ని రోజులుగా వర్షాలు కురువకపోవడంతో జూరాలకు వరద రావడం లేదు. దీంతో జూరాలలో నీరు అందకపోవడంతో రెండురోజులు మాత్రమే నీటిపంపింగ్ చేసి నిలిపివేశారు. ప్రస్తుతం కోయిల్‌సాగర్‌లో పది అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. గతేడాది ఇదివరకే నీటిపంపింగ్ ప్రారంభించారు.


