కేటీదొడ్డి: ఎరువులు, విత్తన డీలర్లు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీఏఓ వీరప్ప హెచ్చరించారు. శుక్రవారం కేటీదొడ్డి మండలం కుచినెర్లలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విత్తన నిల్వల రికార్డులతో పాటు స్టాక్ బోర్డులో పొందుపరిచ్చిన వివరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ దుకాణాల్లో స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలని.. నకిలీ విత్తనాలు అంటగట్టి మోసంచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు నానో ఎరువుల వైపు మొగ్గు చూపాలని ఆయన సూచించారు. ప్రస్తుత కాలంలో రైతులు సాగు ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీఏఓ వెంట ఏఓ రాజవర్ధన్‌రెడ్డి ఉన్నారు.


