భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

Jun 20 2026 10:44 AM | Updated on Jun 20 2026 10:44 AM

గద్వాల: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి భూసేకరణ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణలో జాప్యంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి.. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన సూచించారు.

● ఓటరు జాబితాలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు ఈ నెల 24వ తేదీలోగా శిక్షణ పూర్తిచేయాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం 25 నుంచి బీఎల్‌ఓలు పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేయాలన్నారు. అక్టోబర్‌ 1 నాటికి తుది ఓటరు జాబితా ప్రకటించే వరకు షెడ్యూల్‌ ప్రకారం చేపట్టాలన్నారు.

● ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాల సమగ్ర డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పది అంశాలపై నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల పూర్తి వివరాలు, మంచి ఫొటోలతో కూడిన బుక్‌లెట్‌ సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా ఈ నెల 28న నిర్వహించే పల్స్‌ పోలియో దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశాల్లో ఎస్‌డీసీ కృష్ణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, ఏఓ భూపాల్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement