హరహర మహాదేవ శంభో శంకర
గద్వాల/ఎర్రవల్లి: ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ శివనామస్మరణతో పల్లె పట్టణం మార్మోగింది. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తజనం.. భోళా శంకరుడి స్మరణలో తరించింది. ముక్కంటికి అభిషేకాలు, దీపారాధన, నైవేద్యాలు సమర్పించి మనసారా కొలిచి.. భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో శైవక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలంపూర్, బీచుపల్లి క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివుడి దర్శనాలు కొనసాగాయి. జిల్లా కేంద్రంలోని నల్లకుంట కాలనీ, తెలుగుపేట కాలనీ శివాలయాలతో పాటు కన్యాకా పరమేశ్వరి, వీరభద్రస్వామి, మార్కండేయస్వామి, నందీశ్వర, భీమలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. నది అగ్రహారం వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. అక్కడ ఉన్న స్పటిక శివలింగాన్ని దర్శించుకున్నారు. పలు ఆలయాల్లో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాలను కనులపండువగా నిర్వహించారు.
హరహర మహాదేవ శంభో శంకర
హరహర మహాదేవ శంభో శంకర


