మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కట్టుదిట్టమైన భద్రత
గద్వాల/అలంపూర్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సోమవారం చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం గద్వాల మున్సిపల్ కార్యాలయంలో డీఎస్పీ మొగిలయ్యతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉంటుందన్నారు. నిబంధనల ప్రకారం నలుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండటం నిషేధమని తెలిపారు. అదే విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక అనంతరం అభ్యర్థులు ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
● అలంపూర్ క్షేత్రంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్షేత్రంలో పర్యటించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.


