నడిగడ్డలో ‘విప్’ లొల్లి
● గద్వాల పురపాలికలోకాంగ్రెస్ పార్టీ విప్ జారీ
● బీఆర్‌ఎస్, బీజేపీ సకాలంలో ఇవ్వలేదంటున్న అధికారులు
● రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఇచ్చామంటున్న ఆయా పార్టీల అధినేతలు
గద్వాల: జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో ఓవైపు హంగ్ ఏర్పడి క్యాంపు రాజకీయాలతో కాక పుట్టిస్తుండగా.. మరోవైపు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలో పాల్గొనే అభ్యర్థులకు ఆయా పార్టీలు జారీ చేసే విప్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సోమవారం నిర్వహించే మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనే ఆయా పార్టీల అభ్యర్థులకు ఆదివారం ఉదయం 11 గంటల వరకే విప్ జారీ చేయాలనే నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. సకాలంలో కాంగ్రెస్ పార్టీ వారు మాత్రమే విప్ జారీ చేశారని.. బీఆర్‌ఎస్ పార్టీ వారు మధ్యాహ్నం 1గంట తర్వాత ఇచ్చారని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు ‘సాక్షిశ్రీకి తెలిపారు. ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు మాత్రం తాము విప్ పత్రాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చామని తెలిపారు. అదే విధంగా చైర్మన్ ఎన్నికకు గంట ముందు కూడా విప్ జారీ చేయవచ్చని చెబుతున్నారు. మొత్తానికి ఓవైపు హంగ్ హంగామా కొనసాగుతుండగా.. తాజాగా విప్ లొల్లి కూడా జతకావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న పంచాయితీ తమకు చుట్టుకుందని వాపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుందో.. ఏ పార్టీ వారు పుర పీఠాన్ని కై వసం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.


