
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మల్దకల్: వర్షాకాలంలో సీజనల్‌గా వచ్చే వ్యాధుల పట్ల వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ సిద్దప్ప వైద్యసిబ్బందికి సూచించారు. సోమవారం మల్దకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్యసిబ్బంది, రోగుల నమోదు రిజిష్టర్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకంగా చేపట్టిన స్వస్థి నారీ స్వశక్తి పరీవార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రం నుంచి వివిధ విభాగాలకు సంబంధించిన 8మంది వైద్యులు మల్దకల్ పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో 302మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అవసరమైన వారికి జిల్లా కేంద్రానికి రెఫర్ చేసినట్లు డాక్టర్ స్వరూపరాణి తెలిపారు. మహిళల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకుని వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేయించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమ కుటుంబం అన్ని విధాలా బాగుంటుందన్నారు.డాక్టర్లు సంధ్య కిరణ్మయి, రిజ్వానా, ప్రసూన పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు
12 అర్జీలు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు మొత్తం 12 మంది అర్జీలు అందాయి. సోమవారం ఎస్పీ శ్రీనివాసరావు నేరుగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 12 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారం చేకూరుస్తామని బాధితులకు వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు.
వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, మహానైవేద్య నీరాజనం వంటి పూజా కార్యక్రమాలను చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో సరస్వతీదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో అర్చకులు భువనచంద్ర, దినకరన్ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ 65 మంది చిన్నారులకు తల్లిదండ్రుల సమక్షంలో సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి