
ఆడపడుచుల జీవితాల్లో వెలుగులు నిండాలి
గద్వాల న్యూటౌన్: స్థానిక సఖీ కేంద్రం ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వివిధ విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా సంక్షేమ అధికారి సునంద ముఖ్య అతిథిగా హాజరై రంగురంగుల పుష్పాలతో చూడముచ్చటగా రూపొందించచిన బతుకమ్మకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆడపిల్లల పండుగ అన్నారు. బతుకమ్మ పండుగ ప్రతి ఆడపడుచు ఇంట్లో వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సహదేవుడు, శైలజ, డీసీపీఓ నరసింహ, ఐసీపీఎస్, చైల్డ్‌లైన్, సఖీ, భరోసా, బాలసదనం విభాగాల సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో బతకమ్మ సంబురాలు
అలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో తొలిసారి వైద్య అధికారులు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వైద్య విధాన పరిషత్ సంచాలకులు రమేష్‌చంద్ర ఆధ్వర్యంలో వైద్య అధికారులు, వైద్యులు, సిబ్బంది రంగు రంగు పూలతో బతకమ్మలను సిద్ధం చేశారు. అదేవిధంగా దుర్గాష్టమి సందర్భంగా వైద్య పరికరాలకు ఆయుధ పూజలు చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్‌ఎంఓ అమీర్, వైద్యులు దివ్య, వృషాలి, ప్రవీణ్, మహేష్, వైద్య సిబ్బంది, పారమెడికల్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆడపడుచుల జీవితాల్లో వెలుగులు నిండాలి