
అయ్యో.. అయ్యయ్యో!
‘స్థానిక’ రిజర్వేషన్లలో పంచాయితీ
● ఎస్టీలు లేని చోట ఎస్టీకి.. ఎస్సీలు లేని చోట ఎస్సీకి..
● పలు గ్రామాల్లో కిరికిరి.. కొన్ని చోట్ల అనివార్యంగా పదవులు
● నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆ 4 గ్రామాల్లో ‘ప్రత్యేక’ పరిస్థితి
● ఎస్టీలు లేకున్నా సర్పంచ్ స్థానాలు ఆ వర్గానికే రిజర్వ్‌డ్
● 2019లో జరగని ఎన్నికలు.. ఈ సారీ స్వయం పాలనకు దూరమేనా..?
ఎస్సీలు లేని చోట ఎస్సీలకు.. ఎస్టీలు లేని చోట ఎస్టీలకు.. ఇలా ‘స్థానిక’ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు పదవులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గానికి చెందిన ఓటర్లే లేకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని పల్లెల్లో ఒకరు, ఒకట్రెండు కుటుంబాలు ఉన్న సామాజిక వర్గాలకు అనివార్యంగా పదవులు దక్కనున్నాయి. ఇదేక్రమంలో ఎన్నో ఆశలతో బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న వివిధ పార్టీల్లోని ముఖ్య నేతల అనుచరులకు భంగపాటే ఎదురైంది. తారుమారైన రిజర్వేషన్లు దేవరకద్రతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నాయకుల ఆశలపై నీళ్లు చల్లగా.. వారిలో నైరాశ్యం అలుముకుంది.
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్