
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
గద్వాల: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఎన్నికల అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు నిబద్ధతో పనిచేయాలని, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ నేతల విగ్రహాలకు మాస్కులు వేయించాలని, పోస్టర్లు, బ్యానర్ల తొలగింపు పనులు జిల్లా నోడల్ అధికారులతో పాటు మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, గ్రామ కార్యదర్శులు, జీపీఓలు పర్యవేక్షించాలన్నారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వడం, ప్రచార సమయం, అభ్యర్థుల ఖర్చు వివరాలు నమోదు చేయడం వంటి విషయాలపై సమగ్రంగా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, భూ సేకరణ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఆర్డీఓ అలివేలు, డీఎస్పీ మొగులయ్య, డీపీఓ నాగేంద్రం తదితరులు ఉన్నారు.
నాయకులు సహకరించాలి
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియామావళిపై ప్రతి గ్రామంలో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన కనీసం ఒక్క కార్యకర్తకై నా అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ భవనాలు, ఆస్తులపై రాజకీయ ప్రచారాలకు సంబంధించి రాతలు, పోస్టర్లు అతికిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేటు భవనాలపై సైతం ఏమైనా పోస్టర్లు అతికిస్తే సంబంధిత యజమానుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా సంబందిత అధికారులకు సంప్రదించాలని సూచించారు.