
పాలనలో నిస్తేజం..!
జిల్లాలోని మున్సిపాలిటీల్లో 50 శాతం దాటని పన్ను వసూళ్లు
● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు
● అభివృద్ధి పనులపై ప్రభావం
● సిబ్బందిలో సమన్వయ లోపం
గద్వాల టౌన్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలన నిస్తేజంగా మారింది. అధికారులకు కిందిస్థాయి సిబ్బందిపై అజమాయిషీ లేకుండా పోయింది. చివరకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. నిర్దేశించిన లక్ష్యంలో రెవెన్యూ సిబ్బంది కనీసం సగటును కూడా సాధించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా 50 శాతం రెవెన్యూ వసూళ్ల లక్ష్యాన్ని దాటలేదు. ఈ విషయాలను చక్కదిద్దే ప్రయత్నం చేయని అధికారులు.. అభివృద్ధిపై, నిధుల మంజూరుపై ఊకదంపుడు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు.
అధికారుల హడావుడి
ప్రజలంతా సకాలంలో పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ గడువులోగా పన్నులు చెల్లించాలంటూ పేదవారిపైనే ఒత్తిడి చేస్తున్న అధికారులు.. పలుకుబడి కలిగిన వారిపై మెతక వైఖరి అవలంభిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2025–26వ ఆర్థిక సంవత్సరం ముగియటానికి మరో ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. మిగతా కాలంలోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అధికారులు హడాహుడి చేస్తున్నారు.
పట్టింపు కరువు
మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి అవసరమైన నిధులు లేవని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ పన్నుల వసూళ్లలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో గద్వాల, అయిజ మున్సిపాలిటీల్లో ఉన్న కమిషనర్ల బకాయిదారులపై కొరడా ఝులింపించి పన్ను వసూళ్లు చేయగలిగారు. ప్రస్తుతం అధికారుల ఉదాసీనత వల్ల ఏటా రూ.కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. గద్వాల మున్సిపాలిటీలో రెగ్యులర్ ఆస్తిపన్ను కాకుండా, రూ.5.10 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయి. అయిజ మున్సిపాలిటీలో రూ.30.26 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. రెవెన్యూ విభాగంలో సిబ్బంది కొరతతో పాటు, కొత్తగా నియామకం అయిన వార్డు ఆఫీసర్లకు ఇతర విభాగాల బాధ్యతలను అప్పగించడం.. ఆరు నెలల్లోనే మిగిలిన 70 శాతం మేర పన్నులను వసూలు చేయాల్సి ఉంది.