
బీచుపల్లిలో నీట మునిగిన గుడిసెలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చి చేరుతుండడంతో జూరాల నుంచి 39 గేట్ల ద్వారా 5.70లక్షల క్యూసెక్కులకుపైగా వరద దిగువన ఉన్న శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో బీచుపల్లి వద్ద కృష్ణనది ఉగ్రరూపం దాల్చుతోంది. పుష్కరఘాట్లు పూర్తిగా వరద నీటిలో మునగడంతో పాటు శివాలయం, పిండప్రదాన గదులు సైతం వరద నీరు చుట్టుముట్టాయి. శివాలయం సమీపంలో పలు హోటల్లు, గుడిసెలు వరద నీటిలో మునగడంతో అధికారులు వారిని అక్కచి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీచుపల్లిలోని కోదండ రామస్వామి ఆలయ సమీపంగా వరద నీరు ప్రవహిస్తుంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోదండాపురం ఎస్‌ఐ మురళి తెలిపారు. ప్రస్తుతం కృష్ణానదికి వరద ప్రవాహం అధికంగా ఉందని, నది పరివాహక ప్రాంతంలో నివసించే గొర్లు, బర్రెల కాపరులు మేత కోసం, మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్లరాదని తెలిపారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, పాడుబడ్డ ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వాగులు, వంకలను దాటేటప్పుడు వాహనదారులు, ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

బీచుపల్లిలో నీట మునిగిన గుడిసెలు