
విద్యాప్రదాయిని సరస్వతీదేవి
గద్వాలటౌన్/ఎర్రవల్లి: అజ్ఞానులకు జ్ఞానం ప్రసాదించే జ్ఞానప్రదాయినిగా... సకల జగత్తుకు ఆధారమైన వేదాలను ప్రసాదించిన వరదాయినిగా... చదువుల నొసగే అభయ ప్రదాయినిగా.. సరస్వతీదేవిగా అమ్మవారు జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. దేవిశరన్నవరాత్రుల ఉత్సవాలు గద్వాలలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 8వ రోజు సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నుంచే ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలకు భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయంలో అమ్మవారు సరస్వతీదేవి రూపంలో, కన్యకాపరమేశ్వరి, రెండవవార్డులోని శక్తిస్వరూణి తాయమ్మ ఆలయంలో, పిలిగుండ్లలోని శివకామేశ్వరి దేవి ఆలయంలో, మార్కెండేయస్వామి ఆలయంలో, బాలాజీవీధిలోని శివాలయంలో, కాళికామాత, కుమ్మరివీధిలలో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఆయా ఆలయాలలో మహిళలు కుంకుమార్చనలు చేశారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు.
● బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో దుర్గామాత సరస్వతీదేవి అవతారంలో, కోదండరామస్వామి ఆలయంలో జ్ఞానసరస్వతీదేవి నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా ఆలయాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు.

విద్యాప్రదాయిని సరస్వతీదేవి

విద్యాప్రదాయిని సరస్వతీదేవి