
వాడవాడలా బతుకమ్మ సంబరాలు
గద్వాలటౌన్: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ బతుకమ్మను మహిళలు కీర్తించారు. సాంప్రదాయ వస్త్రధారణతో అలరించారు. ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జామాయే సందమామ.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాటలు పడుతూ ఆటలు ఆడారు. సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అధ్యాపకులు, విద్యార్థినులు కళాశాల ఆవరణలో బతుకమ్మలను ఒకచోట చేర్చి పాటలకు అనుగుణంగా లయబద్దంగా చప్పట్లు చరుస్తూ ఆడారు. ఎమ్మెల్యే సతీమణి బండ్లజ్యోతి బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. అధ్యాపకుల, విద్యార్థినులతో కలిసి బొడ్డెమ్మలు వేశారు. ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా సందడి చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి, సోమవారం సాయంత్రం రెండు రోజుల పాటు బతుకమ్మ పాటలు హోరెత్తించాయి. పట్టణంలోని సగ భాగం కాలనీలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. రెండవ వార్డులోని తాయమ్మ ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆటపాటలతో ఉత్సహంగా గడిపారు. పాత హౌసింగ్ బోర్డు కాలనీలో బతుకమ్మ సందడి కనిపించింది. బొడ్డెమ్మలు, కోలాటాలతో సందడి చేశారు. 03, 06, 12, 27, 28 33, 34 తదితర వార్డులలో మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం అందుబాటులో ఉన్న జలశయాలలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి జ్యోతి మాట్లాడారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. బతుకమ్మ మహిళలకు ప్రత్యేకమైన పండగ అని వివరించారు. బతుకమ్మ పండగ వారసత్వ సంపదగా మిగిలి ఉందని చెప్పారు.

వాడవాడలా బతుకమ్మ సంబరాలు

వాడవాడలా బతుకమ్మ సంబరాలు