
రహదారులకు మహర్దశ
ఉమ్మడి జిల్లాలో రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించిన ప్రభుత్వం
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కీలకమైన రహదారులకు మహర్దశ పట్టనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీటి విస్తరణ కోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది. మహబూబ్‌నగర్, వనపర్తి సర్కిళ్ల వారిగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం 41 రోడ్ల విస్తరణ, బలోపేతం చేసేందుకు రోడ్డు, భవనాల శాఖ నిధులు కేటాయించింది. ప్రధానంగా జిల్లాలను అనుసంధానం చేస్తూ కొనసాగుతున్న రహదారులతోపాటు మండలాలు, గ్రామాలకు కనెక్టింగ్ రోడ్లను విస్తరించనున్నారు. మహబూబ్‌నగర్ ఆర్‌అండ్‌బీ సర్కిల్‌లో మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం 380.85 కి.మీ., మేర రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.434.19 కోట్లు కేటాయించింది. అలాగే వనపర్తి సర్కిల్‌లో వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో 15 రోడ్లను ప్రభుత్వం డబుల్ రోడ్లుగా విస్తరించనుంది. మొత్తం 279.16 కి.మీ., మేర రహదారులను విస్తరించాల్సి ఉండగా ఇందుకోసం రూ.399.34 కోట్లు మంజూరు చేసింది.
పెండింగ్‌లో ఉన్నవాటికి మోక్షం..
ఉమ్మడి జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రధాన రహదారుల విస్తరణ, మరమ్మతు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణాలు మాత్రమే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలను ఒక దానితో మరొకటి అనుసంధానిస్తూ ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్లు, మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్ల విస్తరణతోపాటు మరమ్మతుకు సైతం నోచుకోవడం లేదు. సుమారు ఐదేళ్లకుపైగా ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతు లేకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే కనెక్టింగ్ రోడ్లు వర్షాలకు దెబ్బతిని, కంకర తేలి దర్శనమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ రోడ్ల విస్తరణ, మరమ్మతుకు నిధులను మంజూరు చేయడంతో ఈ రోడ్ల రూపురేఖలు మారిపోనున్నాయి.
హెచ్‌ఏఎం విధానంలో..
ఈసారి రహదారుల నిర్మాణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యూటీ మోడ్ (హెచ్‌ఏఎం) విధానంలో చేపడుతోంది. పూర్తిస్థాయిలో నిధులను ప్రభుత్వమే ఖర్చు చేయకుండా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారులను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాలను ఈ విధానంలోనే చేపడుతుండగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఏఎం విధానంలో రోడ్ల విస్తరణ చేపట్టనుంది. ఈ విధానంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 40 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చితే మిగతా 60 శాతం నిధులను ఆయా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు సంస్థలే భర్తీ చేయాల్సి ఉంటుంది. తర్వాత 15 ఏళ్లపాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలతోపాటు టోల్ రుసుం సంబంధిత సంస్థలే నిర్వహిస్తాయి. రోడ్ల విస్తరణకు నిధుల కొరత లేకుండా, నిర్ణీత గడువులోగా వేగంగా పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వనపర్తి సర్కిల్ పరిధిలో..
వనపర్తి– జడ్చర్ల వయా వట్టెం, తిమ్మాజిపేట రోడ్డు, బల్మూరు– నాగర్‌కర్నూల్ వయా గోదల్, తుమ్మన్‌పేట్, అచ్చంపేట– రాకొండ వయా ఉప్పునుంతల రోడ్డు, పెంట్లవెల్లి– వనపర్తి వయా శ్రీరంగాపూర్, అమ్రాబాద్– ఇప్పలపల్లి రోడ్డు, వనపర్తి– ఆత్మకూర్, ఆత్మకూర్– మరికల్ రోడ్డు, వనపర్తి– బుద్దారం రోడ్డు, చిన్నంబావి– చెల్లెపాడు రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనుంది. అలాగే బల్మూర్– నాగర్‌కర్నూల్ వయా గోదల్, తుమ్మన్‌పేట్ రోడ్డు, అచ్చంపేట– రాకొండ, పెంట్లవెల్లి– వనపర్తి రోడ్లను డబుల్‌గా విస్తరించనున్నారు.
మహబూబ్‌నగర్
సర్కిల్ పరిధిలో
జోగుళాంబ గద్వాలలోని ఎర్రిగెర– అయిజ– అలంపూర్ రోడ్డు (బల్గెర, మిట్టిదొడ్డి, తుమ్మపల్లి, శాంతినగర్, కౌకుంట్ల, శ్రీనగర్, కొరివిపాడు, బొంకూర్)ను విస్తరించారు. అలాగే గద్వాల– రంగాపూర్ రోడ్డు, తుంగభద్ర బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, గద్వాల– అయిజ రోడ్డు (బింగిదొడ్డి, అయిజ) రోడ్లను మెరుగుపరచనున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి– జడ్చర్ల వయా బిజినేపల్లి రోడ్డు, మహబూబ్‌నగర్– మంగనూర్ రోడ్డు, మహబూబ్‌నగర్– నవాబుపేట రోడ్డు, వేపూర్ జెడ్పీ రోడ్డు నుంచి కొమ్మిరెడ్డిపల్లి వయా షేక్‌పల్లి, కురుమూర్తిరాయ టెంపుల్ రోడ్డు, గుడిబండ– తిరుమలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్‌కొండ రోడ్డు వయా మల్కాపూర్, మణికొండ రోడ్డు, జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్తమొల్గర రోడ్డు, రాజాపూర్– తిరుమలాపూర్, మరికల్– మిన్సాపూర్ రోడ్డు, మక్తల్– నారాయణపేట వయా లింగంపల్లి రోడ్లను పునరుద్ధరించనున్నారు.
మహబూబ్‌నగర్ సర్కిల్ పరిధిలో 380.85 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి రూ.434 కోట్లు
వనపర్తి సర్కిల్‌లో 15 రోడ్ల నిర్మాణానికి రూ.399.34 కోట్లు మంజూరు
హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో పనులు చేపట్టేందుకు చర్యలు
జిల్లాలు, మండలాలు, గ్రామాల కనెక్టింగ్ రోడ్లకు ప్రాధాన్యం