
నిబంధనలు పట్టవా?
ప్రిస్కిప్షన్ లేకుండానే ఔషధాల విక్రయాలు
●
లైసెన్స్ రద్దు చేస్తాం
అనుమతి లేకుండా మెడికల్ దుకాణాలు, ఏజెన్సీలు ఏర్పాటు చేసినా.. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే సదరు దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తాం. గర్భవిచ్ఛిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ విక్రయాలు, వాటికి సంబంధించిన రికార్డులపై తనిఖీలు నిర్వహించాం. మూడు మెడికల్ దుకాణాల నిర్వాహకులు సరైన రికార్డులు చూయించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ప్రజలు సైతం ఇష్టారీతిలో మందులు కొనుగోలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. – వినయ్,
జిల్లా ఇన్‌చార్జి ఔషధ నియంత్రణ అధికారి
గద్వాల క్రైం: జిల్లాలో కొందరు మెడికల్ షాపు యజమానులు.. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే పలు మందులు విక్రయిస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఔషధ నియంత్రణ అధికారులు గత వారం రోజులుగా గద్వాల – అలంపూర్ సెగ్మెంట్‌లలో తనిఖీలు నిర్వహించిన క్రమంలో బహిర్గతం అయ్యింది. నిబంధనలు ఉల్లంఘించిన 21 మెడికల్ దుకాణాలకు నోటీసులు జారీ చేసి అయిదు రోజుల పాటు సస్పెనషన్ వేటు వేశారు. మరో వైపు గర్భవిచ్చిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ అమ్మకాలపై ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఉన్న మూడు ఫార్మసీలలో తనిఖీలు చేయగా గర్భవిచ్ఛిత్తి మాత్రలు, అబార్షన్ కిట్ రికార్డులు లేకపోవడంతో ముగ్గురికి షోకాజ్ నోటీసులను జిల్లా ఇంచార్జ్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వినయ్ ఇచ్చారు. మొత్తంగా జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించి మందుల విక్రయాలు జరుగుతున్నాయని తనిఖీల్లో బహిర్గతం అయ్యింది.
తనిఖీలు ముమ్మరం
గద్వాల, అయిజ, అలంపూర్, ధరూర్, గట్టు, ఇటిక్యాల, శాంతినగర్ తదితర మండలంలోని మెడికల్ దుకాణాలపై ఔషధ నియంత్రణ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయడంతో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పలువురికి షోకజ్ నోటీసులు జారీ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా మందులు, ఇంజక్షన్‌లు ఆర్‌ఎంపీలు సైతం విక్రయాలు చేయడం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించి సీజ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడితే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు దోహద పడుతుంది.
మెడికల్ షాపు యజమానుల
ఇష్టారాజ్యం
మత్తు ఇంజెక్షన్లు, గర్భస్త్రావం మాత్రలు యథేచ్ఛగా విక్రయాలు
రికార్డుల నిర్వహణలోనూ నిర్లక్ష్యం
అధికారుల తనిఖీల్లో పలు విషయాలు వెలుగులోకి..

నిబంధనలు పట్టవా?