
ఈ–పాస్ ద్వారానే ఎరువుల విక్రయాలు
ఎర్రవల్లి: ఎరువుల డీలర్లు రైతులకు ఈ –పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కోదండాపురం, పుటాన్‌దొడ్డి గ్రామాలను సందర్శించి రైతులు వానాకాలంలో సాగు చేసిన వివిధ పంటలను ఏఓ రవికుమార్‌తో కలిసి పరిశీలించారు. అలాగే కోదండాపురం స్టేజీలోని రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణాన్ని, ఎరువుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. ఎరువుల కోసం వచ్చే ప్రతి రైతు నుంచి ఆదార్ కార్డు తీసుకొని ఈ పాస్‌లో నమోదు చేసిన తర్వాతే ఎరువులను విక్రయించాలన్నారు. ప్రభుత్వం ముద్రించిన ధరల కంటే అధికంగా విక్రయించరాదని ఆదేశించారు. రైతులు తమకు కావాల్సిన మోతాదు మేరకు మాత్రమే యూరియాను పంటలకు వాడుకోవాలన్నారు. ఎక్కువ మొత్తంలో యూరియాను వాడటం వల్ల పంటలకు లాభం కంటే నష్టం అధికంగా జరుగుతందన్నారు. రెండవ సారి యూరియాను వాడాలనుకునే రైతులు వంద శాతం నీటిలో కలిగే సూక్ష్మ రూపంలో దొరికే నానో డీఏపీ, నానో యూరియాను ఒక ఎకరానికి 500 మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేస్తే మొక్కలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో ఏఓ రవికుమార్, డీలర్ రవి, రైతులు రామిరెడ్డి, మల్లికార్జున్ ఉన్నారు.