
టీచర్‌గా మారిన కలెక్టర్..
గద్వాలటౌన్: పిల్లలూ... ఎలా చదువుతున్నారు, ఇంగ్లీష్ చదవడం వచ్చా.. అంటూ విద్యార్థినులను పలకరించారు కలెక్టర్ సంతోష్. కలెక్టర్ అడిగిన ప్రశ్నకు ఆ.. వచ్చు సార్ అంటూ పిల్లలు బదులిచ్చారు. బుధవారం గద్వాల మండలం గోనుపాడులో ఉన్న కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల చేత పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని అడిగి సమాధానాలు రాబట్టారు. బాగా చదువుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిని, విద్యార్థుల ఫెషియల్ రికగ్నిషన్‌ను పరిశీలించారు. యూడైస్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు.ఇదిలాఉండగా, మధ్యాహ్న భోజన తనిఖీలో లోపాలు కనిపించడం, మెనూ పాటించకపోవడంపై కలెక్టర్ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో ఎస్‌ఓకు మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా కలెక్టర్ పాఠశాలలోని వంటగది, తగునీరు, భోజనం నాణ్యత, స్టోర్ రూంలోని సరుకులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు.