గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో గణపేశ్వరుడికి భక్తులు అభిషేకాలు నిర్వహించి అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు. పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందచేసి ఆశీర్వచనలు అందచేశారు.
తప్పిదాలపై
విచారణ జరిపించాలి
భూపాలపల్లి రూరల్: జిల్లావ్యాప్తంగా 22(ఏ) నిషేధిత భూముల జాబితాలో చోటుచేసుకున్న తప్పిదాలు, అక్రమ చేర్పులపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ జాబితాలో జరిగిన చేర్పులు, తొలగింపులపై సమగ్ర విచారణ జరిపి, గ్రామం, మండలం, సర్వేనంబర్ వారీగా పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరణి, భూ భారతి తదితర డిజిటల్ భూ రికార్డుల్లో జరిగిన మార్పులపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు, నాలుగో వార్డ్ కౌన్సిలర్ కన్నం యుగంధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి ప్రసాదరావు, జన్నే మొగిలి, ఎరుకల గణపతి పాల్గొన్నారు.
బురద రోడ్డుపై
నాట్లువేసి నిరసన
రేగొండ: కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో రోడ్డుపై గ్రామస్తులు సోమవారం నాటువేసి నిరసన తెలిపారు. గ్రామంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వర్షాలు పడటంతో రోడ్డు మొత్తం బురదమయంగా మారింది. గుంతలలో నీరు నిలిచి కనిపించకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. రోడ్ల దుస్థితిపై అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో సోమవారం రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు.
మెడికల్ కళాశాల
నిర్మాణ పనుల పరిశీలన
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ప్రతీ గదిని సందర్శించిన ఎమ్మెల్యే పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. సుమారు 242 మంది విద్యార్థులకు వసతి కల్పించే ఈ హాస్టల్ నిర్మాణాన్ని వేగవంతం చేసి సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన అనంతరం హాస్టల్ చుట్టూ ప్రహరీతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతి వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కాలేజీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.


