పక్కనున్న ఫొటో రేగొండ మండలం గూడెపల్లి శివారులో మలుపు. భాగిర్తిపేట క్రాస్ నుంచి గూడెపల్లి మీదుగా కోటంచకు వెళ్లే రహదారి ఇది. కోటంచ జాతర సమయంలో ఈ రోడ్డు గుండా ఆర్టీసీ బస్సులు వెళ్తాయి. రోజువారీగా మాత్రం జాతరకు వెళ్లే వాహనాలతో పాటు, గ్రామాలకు ప్రైవేట్ వాహనాలు వందల సంఖ్యలో వెళ్తుంటాయి. అదే విధంగా ద్విచక్రవాహనదారులు కూడా ఈ మార్గం గుండా వందలాది మంది నిత్యం ప్రయాణం చేస్తుంటారు. గూడెపల్లి శివారులో మలుపు వద్ద ఉన్న బావితో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. బావి ఉందనే సమాచారం గానీ, హెచ్చరిక బోర్డులు గానీ లేవు. రక్షణ గోడలు సైతం లేవు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే తీవ్ర ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కొడవటంచ ఆలయంతో పాటు రహదారులు, కాంప్లెక్స్‌లు, అతిథిగృహలను దాదాపు రూ.100 కోట్లతో నిర్మాణం చేపట్టారు. దీంతో ఆలయానికి నిత్యం భక్తుల తాకిడి ఎక్కువైంది. కావున రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


