దూరవిద్య డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

దూరవిద్య డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

Aug 18 2026 7:16 AM | Updated on Aug 18 2026 7:16 AM

భూపాలపల్లి అర్బన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏ.రమణారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం కళాశాలలో యూనివర్సిటీకి సంబంధించిన వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులు, గృహిణులు తమ విద్యను కొనసాగిస్తూ డిగ్రీ పూర్తి చేసుకునేందుకు దూరవిద్య మంచి అవకాశమన్నారు. రెగ్యులర్‌ ఇంటర్మీడియట్‌, ఓపెన్‌ ఇంటర్మీడియట్‌, ఒకేషనల్‌ ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌ కోర్సులు, రెండేళ్ల ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన వారు డిగ్రీ ప్రవేశాలకు అర్హులని తెలిపారు. డిగ్రీ ప్రవేశాలకు సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. వివరాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్‌ను సంప్రదించాలని లేదా 63014 96140 నంబర్‌లో వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రుక్సానా మొహమ్మద్‌, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

అవార్డులకు

దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి అర్బన్‌: సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 5న అందజేయనున్న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2026లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖాధికారి రాజేందర్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్పెషల్‌ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, వలంటీర్‌ ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరారు. ఎంపిక కోసం ఒక్కో విభాగం నుంచి రెండు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపాదనలను సంబంధిత మండల విద్యాధికారుల ద్వారా ఈ నెల 24వ తేదీలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.

హామీలు నెరవేర్చాలి

భూపాలపల్లి రూరల్‌: ఎన్నికలకు ముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయాలని గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం అంబేడ్కర్‌ సెంటర్‌కు గీతన్నల చైతన్య బస్సు యాత్రకు సీఐటీయూ వివిధ ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళిక లో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం దేవేందర్‌, నాయకులు రాజేందర్‌, గట్టు శంకర్‌, వెంక ట్‌, సాంబయ్య, రమేష్‌, సుదర్శన్‌ పాల్గొన్నారు

రామప్పలో శ్రావణ శోభ

వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప దేవాలయంలో సోమవారం శ్రావణ సందడి నెలకొంది. శ్రావణమాసంలో తొలి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ సోమవారం సందర్భంగా రామప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

రేషన్‌ షాపుల్లో

కాంటాల తనిఖీ

మంగపేట : మండలంలోని వివిధ గ్రామాల్లోని రేషన్‌ షాపుల్లో కాంటాలను లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత సోమవారం తనిఖీ చేశారు. గిరిజన సహకార సంస్థ, ప్రైవేటు రేషన్‌ డీలర్లు, మహిళా పొదుపు సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రేషన్‌ షాపుల్లో ప్రతి నెలా బియ్యం పంపిణీలో కొందరు నిర్వాహకులు ఎలక్ట్రానిక్‌ కాంటాలపై అవగాహన ఉన్న వ్యక్తుల సహకారంతో టెక్నాలజీని ఉపయోగించి తూకంలో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కమలాపురం, బోరునర్సాపురంలోని నాలుగు రేషన్‌ షాపుల్లో ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ మిషన్లను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement