భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులతో కలిసి ఈ నెల 19న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం కలెక్టర్ తన కార్యాలయంలో కమిషన్ చైర్మన్, సభ్యుల పర్యటన ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 19న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కులు, వివిధ శాఖల్లో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమీక్షలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన అట్రాసిటీ కేసుల విచారణ, పరిష్కారం, వివిధ ప్రభుత్వ శాఖల్లో రోస్టర్ పాయింట్ల అమలు తీరును పరిశీలించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ ప్రక్రియతో పాటు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంబంధించి శాఖల వారీగా అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించనున్నట్లు తెలిపారు. సమీక్షా సమావేశానికి అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్వో వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
మండల, జిల్లాస్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 67 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా పరిష్కరించి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు సానుకూలంగా స్పందిస్తూ, వినతుల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులతో కలెక్టర్ సమీక్ష


