భూపాలపల్లి అర్బన్: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ఏర్పాటుచేసిన మోడల్ స్కూళ్లను మరింత బలోపేతం చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మోడల్‌స్కూళ్లలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విధానం అమలుచేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రణాళిక రూపొందించింది. విద్యాశాఖ నిర్ణయంతో జిల్లాలోని 6 మోడల్ స్కూళ్లలో చదువుతున్న సుమారు 2వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
2013లో ఏర్పాటు
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందించాలనే ఉద్దేశంతో 2013లో రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేసింది. ఇందులో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు బోధిస్తున్నారు. ఈ పాఠశాలలు ప్రతీ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తమ ప్రత్యేక తను చాటుకుంటున్నాయి. జిల్లాలో 6 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల, మల్హర్ మండలం ఎడ్లపల్లి, మహాముత్తారం మండల దొబ్బలపాడు, కాటారం మండలం గంగారంలో మోడల్ స్కూళ్లు ఉన్నాయి.
పాఠశాలల్లో వసతులపై దృష్టి
మోడల్ స్కూల్స్‌లో సీబీఎస్‌ఈ తరహా విద్యా విధానం అమలు కావాలంటే సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, డిజిటల్ తరగతి గదులు, క్రీడా సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం, సబ్జెక్టు నిపుణులు, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టడం చేయాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ అంటే సిలబస్ మార్చడం మాత్రమే కాకుండా బోధన విధానంలోనూ మార్పులు తీసుకురావాలి. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ, బోధన సామగ్రి, విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా మూల్యాంకనం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వానికి
విద్యాశాఖ ప్రతిపాదన
వచ్చే విద్యా సంవత్సరం నుంచి
అమలయ్యే అవకాశం
జిల్లాలో 6 మోడల్ స్కూళ్లు
బోధనలో మార్పులు
సీబీఎస్‌ఈ విధానంలో పాఠ్యాంశాలను బట్టి పట్టించడం ఉండదు. విద్యార్థుల్లో విషయ అవగాహన, తార్కిక ఆలోచన, విశ్లేషణాత్మక దృక్పథం, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రాధాన్యత ఉంటుంది. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను రోజువారి జీవితంతో అనుసంధానం చేసుకునేలా బోధనా పద్ధతులు ఉంటాయి. దాంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరగడంతో పాటు, ఉన్నత విద్యలో ఎదురయ్యే పోటీని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. సీబీఎస్‌ఈ విద్యా విధానం అమలైతే భవి ష్యత్‌లో పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు సులభమయ్యే అవకాశం ఉంటుంది.


