భూపాలపల్లి అర్బన్: నేటి (సోమవారం) నుంచి ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల ప్రజలు తమ దరఖాస్తులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమంలో ఇవ్వాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల మండలస్థాయి అధికారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రజావాణి కార్యక్రమాన్ని మండలస్థాయిలో నిర్వహిస్తున్నందున, ప్రజలు తమ సమస్యలు, వినతులు ఇచ్చేందుకు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని తెలిపారు. మండల స్థాయిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు, శ్రావణ మాసం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరకుని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్ ఆచార్యులు, ఈశ్వర్‌చంద్‌శర్మ, అనిపెద్ది రాజీవ్ శర్మ స్వామివారికి నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరాన్ని పోలి ఉండే లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. వందల సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తజనంతో సందడి నెలకొంది.
హేమాచలుడిని దర్శించుకున్న కమిషనర్
మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ముందుగా హేమాచలక్షేత్రానికి వచ్చి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ఆలయంలోని స్వయంభు స్వామివారికి కమిషనర్ గోత్రనామాలతో అర్చనలు జరిపించి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫైనాన్స్ కమిటీ సమావేశం ఈ నెల 17న (సోమవారం) హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో నిర్వహించనున్నారు. కేయూలో 24వ కాన్వొకేషన్‌ను ఈఏడాది నవంబర్‌లో నిర్వహించాలని వర్సిటీ అదికారులు తాజాగా నిర్ణయించారు. గోల్డ్‌మెడల్స్‌కు, తదితర నిర్వహణ ఖర్చుల నిమిత్తం నిధుల వినియోగానికి ఫైనాన్స్ కమిటీ అప్రూవల్ కోసం ఎజెండాలో పెట్టారు. అదేవిధంగా వివిధ పనులకు ఎంతెంత వెచ్చించనున్నారో ఇందులో చర్చించనున్నారు. ఆమోదం పొందాక ఈనెల 18న కేయూలో జరిగే పాలకమండలి సమావేశంలోను ఆమోదం లభించాల్సి ఉంటుంది.


