భూగర్భ జలాల పెంపే ప్రభుత్వ లక్ష్యం
జిల్లాలో
నిర్దేశించిన పనుల వివరాలు
ప్రజలు భాగస్వాములు కావాలి
జలసిరి
భూపాలపల్లి రూరల్: భూగర్భ జల వనరుల సంరక్షణతో పాటు ప్రస్తుత ఎల్‌నినో రక్కసిని తరిమేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ జలసిరి పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ పథకం నిధులతో గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్, ఊటకుంటలు, ఓపెన్ బావుల నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులను తరిమికొట్టి భూగర్భ జలాలు పెంచాలని నిర్ణయించింది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, ఆ మేరకు రైతులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.
వర్షపు నీటిని సంరక్షించేలా..
జలసిరి కార్యక్రమంలో చేపట్టే పనులన్నీ వర్షపు నీటిని ఒడిసి పట్టడమే ముఖ్య లక్ష్యం. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ ఇంకుడుగుంతలు నిర్మించుకునేలా చర్యలు చేపట్టనున్నారు. పంట పొలాల్లో వర్షపు నీటిని సంరక్షిస్తూ సాగుకు వినియోగించుకునేలా నీటి కుంటలు (ఫాంపాండ్స్), నీరు అడుగంటిన బోర్ బావులు, చేతిపంపుల వద్ద రీచార్జ్ గుంతల నిర్మాణాలతో పాటు నీటి కరువు ఏర్పడకుండా ఉండేలా చిన్నపాటి చెరువు (ఊటకుంట)లను నిర్మించనున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధితో పాటు నీటి సంరక్షణకు తోడ్ప డేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్, అజీవిక మిషన్ (వీబీజీ రాంజీ) పథకం కింద ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు.
వేగంగా అనుమతులు..
ప్రస్తుత వర్షాబావ పరిస్థితుల్లో వీటి అవసరం చాలా ఉండటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. జిల్లా యంత్రాంగం తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు పనుల గుర్తింపుతో పాటు అనుమతులను కూడా వేగంగా ఇస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 46,000 ఇంకుడు గుంతలను నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 3,753 గుంతలను గుర్తించారు. ఫాంపాండ్స్ 1,056 పనులకు 384 పనులను గుర్తించారు. అలాగే 240 ఊటకుంటలకు 64, కమ్యూనిటీ ఇంకుడుగుంతలు 72, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు 73, ఓపెన్ బావులు 9 నిర్మించాలని గుర్తించారు. ఆయా పనులకు వెంటనే అనుమతులు కూడా ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం
వీబీజీ రాంజీ పథకం కింద పనులు
ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా ప్రత్యేక కార్యాచరణ
జలసిరి కార్యక్రమంతో వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం అందించే నిధులతో నిర్మించుకోవాలి. ఇంకుడుగుంతలు, ఊటకుంటలు, బోర్‌వెల్ రీచార్జ్, ఫాంపాండ్స్ నిర్మాణాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి.
–బాలకృష్ణ, డీఆర్‌డీఓ


