భూపాలపల్లి రూరల్: 12వ జాతీయ బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మహా ధర్నాలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలు గు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్నారు. బొగ్గు బ్లాకులను వేలం వేయడం వల్ల సింగరేణి సంస్థతో పాటు లక్షలాది మంది కార్మికుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కాకుండా నేరుగా సింగరేణి సంస్థకు కేటాయించాలన్నారు. కోయగూడెం ఓసీ–3 బొగ్గు గనిని కూడా సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ విధానాలకు ప్రాధాన్యం ఇస్తూ బొగ్గు బ్లాకులను వేలం వేస్తోందని అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులు ఉద్యమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.


