మృత్యువుకు హైవే.. | - | Sakshi
Sakshi News home page

మృత్యువుకు హైవే..

Jun 23 2026 1:10 AM | Updated on Jun 23 2026 1:10 AM

–8లోu

భూపాలపల్లి: జిల్లా పరిధిలో హైవేపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను వణికేలా చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట పచ్చని సంపారాల్లో ఈ ప్రమాదాలు చీకట్లు నింపుతున్నాయి. బొగ్గు, ఇసుక లారీలు అధిక లోడ్‌, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, అతివేగం కారణంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారానికి రెండు, మూడు ఆక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. పోలీసు, రవాణాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. తాజాగా విధి నిర్వహణలో ఉన్న రవాణాశాఖ జిల్లా అధికారే హైవేపై లారీ ఢీకొని దుర్మరణం పాలవ్వడం ఇక్కడి ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటన జిల్లా ప్రజలను కలచివేసింది.

ఎన్‌హెచ్‌పై నిత్యం ప్రమాదాలే..

జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపూర్‌ గ్రామ సరిహద్దు నుంచి కాటారం మండలం నస్తూర్‌పల్లి వరకు ఎన్‌హెచ్‌ 353సీ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారి అక్కడక్కడ మాత్రమే మరమ్మతుకు నోచుకుంది. అయినప్పటికీ ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలపై పలువురు పోలీసు అధికారులు పరిశీలన చేయగా, అందులో నూటికి 90 శాతం ప్రమాదాలు డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓవర్‌ స్పీడ్‌, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగానే చోటుచేసుకున్నట్లు తెలిసింది. తొమ్మిదేళ్ల క్రితం ఇలాగే నిత్యం ప్రమాదాలు జరగడంతో అప్పటి ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ జాతీయ రహదారిపై స్పీడ్‌ బ్రేకర్లు వేయించారు. ఎన్‌హెచ్‌పై స్పీడ్‌ బ్రేకర్లు ఉండకూడదనే నిబంధనలు ఉండటంతో కొద్ది రోజులకే వాటిని తొలగించారు. దీంతో బైక్‌, కార్లు, లారీలు పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నాయి. ఇందుకు తోడు రాత్రివేళల్లో మద్యం సేవించి వాహనం నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

బొగ్గు, ఇసుక లారీలతోనే ఎక్కువగా..

జిల్లాలో బొగ్గు, ఇసుక రవాణా చేసే లారీలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కోల్‌బెల్ట్‌ పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లిలో సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గును సుమారు 800 టిప్పర్లు, లారీలు వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తుంటాయి. అంతేకాక కాళేశ్వరం గోదావరి నది నుంచి ప్రతీరోజు వందలాది ఇసుక లారీలు జిల్లా మీదుగా హనుమకొండ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఆయా లారీల మూలంగానే ఎక్కువగా, భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధిక లోడ్‌, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా రాత్రివేళల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి.

బ్లాక్‌ స్పాట్స్‌ ఏర్పాటు చేసినా..

జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్‌లుగా ఎన్‌హెచ్‌ అధికారులు గుర్తించారు. ఇందులో అక్కడక్కడ బ్లాక్‌ స్పాట్‌ బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ రేడియం స్టిక్కర్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెద్దగా కనిపించేలా ఏమీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ ప్రాంతాల మీదుగా వెళ్లాలంటే వాహనదారులు జంకాల్సి వస్తుంది.

రోడ్డు ప్రమాదాలు

మరణాలు

తీవ్ర గాయాలైనవారు

37

219

196

223

103

168

124

130

90

80

74

95

2024

2025

2026

జిల్లాలో ఏటా పెరుగుతున్న

రోడ్డు ప్రమాదాలు

లారీల వేగానికి బ్రేకులు వేసేదెన్నడో?

డ్రంకెన్‌ డ్రైవ్‌, అతివేగం,

నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రధాన కారణం

డీటీఓ మృతితో ఉలిక్కిపడ్డ ప్రజలు

బ్లాక్‌ స్పాట్స్‌ ఇవే..

రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి

గణపురం మండలం గాంధీనగర్‌,

మోరంచపల్లి

భూపాలపల్లి పట్టణం అంబేడ్కర్‌ చౌరస్తా, కమలాపూర్‌ క్రాస్‌రోడ్‌

కాటారం మండలం మేడిపల్లి, నస్తూర్‌పల్లి

మహదేవపూర్‌ మండలం కుదురుపల్లి

డీటీఓ మృతితో జిల్లాలో విషాదం..

వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో లారీ ఢీకొట్టగా జిల్లా రవాణాశాఖాధికారి వెంకన్న అక్కడికక్కడే మృతి చెందడంతో జిల్లాలో విషాదం నెలకొంది. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం మూలంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో..

మల్హర్‌ (కాటారం): లారీడ్రైవర్‌ నిర్లక్ష్యంగా రివర్స్‌ చేయడంతో వెనుక ఉన్న క్లీనర్‌ లారీ కింద పడి మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కాటారం ఎస్సై శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్‌కు చెందిన సతీష్‌ కుమార్‌ (35) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. జూన్‌ 21 ఆదివారం రాత్రి మండలంలోని నస్తూర్‌పల్లి వద్ద డాంబర్‌ ప్లాంట్‌లో అన్‌లోడ్‌ చేసేందుకు వెళ్లారు. డ్రైవర్‌ లారీని రివర్స్‌ చేస్తూ వెనుక చూడమని చెప్పడంతో సతీష్‌ కుమార్‌ వెనుక నిలబడ్డాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వేగంగా రివర్స్‌ చేయడంతో లారీ ఢీకొని సతీష్‌ కిందపడ్డాడు. దీంతో వెనుక టైర్లు రెండు కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో కాళ్లు పూర్తిగా నలిగి తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదం అనంతరం డ్రైవర్‌ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. స్థానికులు 100కు సమాచారం ఇవ్వడంతో సతీష్‌ను భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య స్వప్న ఫిర్యాధు మేరకు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ కంకణాల రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

విషాదఛాయలు

కొత్తపల్లిగోరిలో ఇద్దరు మృతి

(మే 30 వరకు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement