వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి

Jun 23 2026 1:10 AM | Updated on Jun 23 2026 1:10 AM

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

భూపాలపల్లి అర్బన్‌: వర్షాలు, వరదలు వంటి అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ సూచించారు. వర్షాలు, వరదల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో రెవెన్యూ, ఇరిగేషన్‌, పోలీస్‌, వైద్య, విద్యుత్‌, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి రవాణా నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు అవసరమైన ఔషధాలు, అత్యవసర వైద్యసేవలను సిద్ధంగా ఉంచాలని, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దష్టి సారించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్‌ అధికారులు సీజనల్‌ వ్యాధుల నివారణ, దోమల వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. చెరువుల పరిరక్షణ, బలహీన ప్రాంతాల పరిశీలన, రక్షణ చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. వర్షాలు, వరదల సమయంలో పశువులను ఎత్తైన ప్రాంతాల్లో ఉంచాలని, రైతులు పొలాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగాన్ని సంప్రదిస్తూ ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఆర్‌ఓ వసంతకుమారి, కాటారం ఆర్డీఓ రవీందర్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement