● జీఎం రాజేశ్వర్ రెడ్డి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన డ్రోన్ టెక్నీషియన్ కోర్సు శిక్షణ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు, గనులు, వ్యవసాయం, భద్రత, సర్వేలు, విపత్తు నిర్వహణ తదితర రంగాల్లో డ్రోన్‌ల వినియోగం విస్తృతంగా పెరుగుతోందన్నారు. భవిష్యత్‌లో డ్రోన్ టెక్నీషియన్లకు మంచి డిమాండ్ ఉండబోతుందని, శిక్షణ పొందుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను విస్తరించడమే సింగరేణి సంస్థ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (క్వాలిటీ) కృష్ణ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్‌సుందర్, విటిసి మేనేజర్ నజీర్, అసిస్టెంట్ మేనేజర్ మహేశ్, ట్రైనర్ సందీప్ పాల్గొన్నారు.
ప్రమాదానికి సింగరేణికి సంబంధం లేదు
రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా అధికారి (డీటీఓ) మృతి చెందిన ఘటన పట్ల సింగరేణి యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన వాహనానికి సింగరేణి కార్యకలాపాలు, బొగ్గు రవాణా వ్యవస్థతో సంబంధం లేదన్నారు. సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ అత్యున్నత భద్రతా ప్రమాణాలు, పాటిస్తుందన్నారు.


