సాగుపై నీలినీడలు | - | Sakshi
Sakshi News home page

సాగుపై నీలినీడలు

Jun 22 2026 1:00 AM | Updated on Jun 22 2026 1:00 AM

తీవ్ర ప్రభావం చూపనున్న ‘ఎల్‌నినో’

ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమంటున్న వ్యవసాయశాఖ

వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు

భూపాలపల్లి: వానాకాలం సాగు సీజన్‌పై ‘ఎల్‌నినో’ ప్రభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు, వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని, పంటల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.

వర్షాల కోసం ఎదురుచూపులు..

జిల్లాలోని 12 మండలాల్లో ఈ వానాకాలం సీజన్‌లో పత్తి, వరి, పెసరు తదితర పంటలు 2,16,734 ఎకరాలు, మొక్కజొన్న 280 ఎకరాలు, మిర్చి సుమారు 25వేల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ, హార్టికల్చర్‌ అధికారులు అంచనా వేశారు. రైతులు సైతం ఈ మేరకే పంటల సాగు చేపట్టాలని భావించి ప్రస్తుతం సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని సుమారు 50వేల ఎకరాల్లో వారం రోజుల క్రితమే ఇప్పటికే రైతులు పత్తి గింజలు నాటారు. మబ్బులు ఉరుమడం, వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ జిల్లా కేంద్రంలో మినహా ఎక్కడ వర్షాపాతం నమోదు కాలేదు. ఉష్ణోగ్రత కారణంగా పత్తి గింజలు మొలకెత్తకపోగా మాడిపోయాయి. వరి, మిర్చి సాగు చేసే రైతులైతే ప్రస్తుత పరిస్థితులను చేసి ఆందోళన చెందుతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించినప్పటికీ, ఈ ప్రభావం ఈ నెలలోనే కనిపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎల్‌నినోతో ఎలాంటి నష్టం..

పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణ వ్యవస్థలో తీవ్ర మార్పులు సంభవిస్తాయి. దీని ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురియక, సుదీర్ఘ పొడి వాతావరణం (వర్షాభావ పరిస్థితులు) ఏర్పడుతుంది. జూన్‌ నెలలో సాధారణ వర్షాలు కురిసినప్పటికీ.. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా భూగర్భ జలాలు రీఛార్జ్‌ కావు. తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉంది. ఒకే రకమైన పంటలపై ఆధారపడితే దిగుబడులు పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది.

సన్నరకాలే మేలు..

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరిసాగులో సన్నరకాలే మేలని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. వానాకాలం సాగుకు అనువైన, తెగుళ్లను తట్టుకునే సన్న వరి రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణ సోనా, కునారం వరి 2, రాజేంద్రనగర్‌ వరి 4 లాంటి రకాలు వాలిపోకుండా, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఉంటాయని, ఈ రకాలు వానాకాలంతో పాటు యాసంగికి కూడా అనుకూలమని వెల్లడించారు.

స్వల్పకాలిక వంగడాలు వేయాలి

ఫసిఫిక్‌ మహా సముద్రంలో వేడి గాలుల వల్ల ఏర్పడేదే ఎల్‌నినో. దీని వలన దేశంలోని కొన్ని రాష్ట్రాలు వర్షాభావ పరిస్థితులకు గురి కానున్నాయి. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో దీని ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీని ఎఫెక్ట్‌ జిల్లాలో ఈ నెలలో కూడా ఏర్పడింది. ఈ వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు స్వల్పకాలిక వరి వంగడాలను సాగు చేయాలి. పప్పు దినుసుల పంటలు, అపరాలు వేసుకుంటే రైతులకు ఇబ్బందులు తలెత్తవు.

– బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి

మిర్చి

25,000

పెసరు

110

పత్తి

1,06,560

మొక్కజొన్న 280

ప్రత్యామ్నాయ పంటలే శ్రీరామరక్ష..

సంప్రదాయ పంటల కంటే తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను ఎంచుకోవడమే ప్రస్తుత పరిస్థితికి ఏకై క పరిష్కారమని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు వంటి ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని అంటున్నారు. అంతేకాక ఒకే పంటపై ఆధారపడకుండా విధిగా పంట మార్పిడి (క్రాప్‌ రొటేషన్‌) చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో జూలై 15 లోపు తగినంత వర్షపాతం నమోదు కాని పక్షంలో 125 రోజుల కంటే తక్కువ కాలపరిమితి గల స్వల్పకాలిక వరి రకాలను మాత్రమే ఎంచుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement