కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వాతావరణం చల్లబడడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
‘ప్రసాదాల విక్రయంలో నిర్లక్ష్యం’
మంగపేట : రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదాలను విక్రయించడంలో అధికారులు, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పెసా మొబిలైజర్ తాటి విజయ్‌బాబు ఆదివారం ఒక్క ప్రకటనలో ఆరోపించారు. నిత్యం వందల సంఖ్యలో వచ్చే భక్తులకు ఆలయంలో విక్రయించే లడ్డు, పులిహోర ప్రసాదాలు లభించకపోవడంతో భక్తుల ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆలయ సిబ్బందితో పాటు మల్టీపర్పస్ సిబ్బందితో కలిసి 15 మంది ఉన్నా నెలనెలా వేతనాలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారనే తప్ప ప్రసాదాల తయారీ, విక్రయాల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆలయంలో పూజ సామగ్రితో పాటు హోటళ్లు, బొమ్మల షాపులకు వేలంపాట నిర్వహించిన అధికారులు గతంలో మాదిరిగా లడ్డు, పులిహోర విక్రయాలకు వేలం పాట పెడితే ఆలయానికి ఎంతో ఆదాయం వచ్చేదని వెల్లడించారు. అధికారులు ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పోరాటానికి మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్
మల్హర్(కాటారం): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య అన్నారు. కాటారం పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను గణాంకాలు, చారిత్రక ఆధారాలతో ప్రజలకు వివరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైందని, ఉద్యమకారులకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ కరుణాకర్ రావు, అంజయ్య, కుమార్ యాదవ్, రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, శ్రీనివాస్, రాజయ్య, రవీందర్, మాధవి, రచన, సృజన, కృష్ణవేణి, భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు.
వ్యవసాయ పనుల్లో రైతన్న నిమగ్నం
మహాముత్తారం: రెండు రోజుల క్రితం మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని బోర్లగూడెం, మీనాజీపేట, కనుకునూర్, సింగారం, గండికామారం గ్రామాల్లోని రైతులు బోరుబావుల కింద నారుమడులు తయారు చేసి వరినారు కోసం మొలక అలుకుతున్నారు. అదే విధంగా మరి కొన్ని గ్రామాల్లో రైతులు మొదటి దఫా వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు పెట్టడానికి చెల్లల్లో దుక్కులు దున్ని సాగుబాటు చేసుకున్నారు. రెండు రోజులు కురిసిన వర్షాలతో ఆయా గ్రామాల్లోని రైతులు తమతమ పత్తి చేన్లలో కూలీలతో పత్తి విత్తనాలు వేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలోనే కాకుండా ఈ సీజన్‌లో ఇంతవరకు భారీ వర్షం కురవడకపోవడంతో అన్నదాతలు సాగు పనులు ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నారు.


