భూపాలపల్లి అర్బన్: పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలను స్కూల్‌లోనే కొనుగోలు చేయాలని జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కండీషన్ పెడుతున్నాయి. లేదంటే యాజమాన్యం చెప్పిన దుకాణాల వద్దే కొనుగోలు చేయాలని నిబంధన పెడుతున్నారు. మార్కెట్‌లో తక్కువ ధరలకు లభించే వస్తువులను అధిక ధరలకు విక్రయించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.
ఫీజులతో పాటు పుస్తకాల భారం..
జిల్లాలో 75 వరకు ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 10 శాతం స్కూళ్లు మాత్రమే నిబంధనలకు లోబడి నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు పూర్తిగా వ్యాపార ధోరణి అవలంభిస్తున్నాయి. విద్యార్థుల ఫీజులు మొదలుకొని, పుస్తకాలు, యూనిఫాం, రవాణా, టర్మ్ ఫీజుల పేరిట అందినకాడికి దండుకుంటున్నాయి. ఏ మాత్రం సౌకర్యాలు లేని పాఠశాలల్లో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయించిన ఫీజు కంటే ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు కాకుండా నోట్ బుక్స్, ఆయా పాఠశాలల వర్క్ బుక్స్ పేరిట రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇవే పుస్తకాలు దుకాణాల్లో కొనుగోలు చేస్తే రూ.వెయ్యికి మించదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ బయట పుస్తకాలు కొనుగోలు చేస్తే వాటిని స్కూల్ యాజమాన్యాలు అనుమతించడం లేదు. చాలా స్కూళ్లల్లో పుస్తకాలు, యూనిఫాలంను వారే విక్రయిస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం
పుస్తకాలు, యూనిఫాంలతో
వేల రూపాయల వసూళ్లు
తల్లిదండ్రులపై పెరుగుతున్న ఆర్థిక భారం
భూపాలపల్లిలో ప్రైవేట్ స్కూళ్లపై
ఫిర్యాదుల వెల్లువ
జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాల ధరలు మండిపోతున్నాయి. నర్సరీకి రూ.3,049, ఎల్‌కేజీకి రూ.4,029, యూకేజీకి రూ.5,249, ఒకటవ తరగతికి రూ.6,164, రెండో తరగతికి రూ.6,574, మూడో తరగతికి రూ.6,029, నాలుగో తరగతికి రూ.6,631, ఐదో తరగతికి రూ.6,796లకు పాఠ్య పుస్తకాలు, డైరీ, నోట్ పుస్తకాలు అమ్ముతున్నారు. ఎందుకు ఇంత ధరలు అని తల్ల్దిండ్రులు ప్రశ్నిస్తే ఇష్టమైతేనే కొనుక్కోండి లేదంటే ఒక్క రూపాయికు కూడా తగ్గేది లేదని బదులిస్తున్నారు.


