● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: జిల్లాలోని అర్హులైన పౌరులందరూ ఈ ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం మన జిల్లాలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరుగుతుందని, బూతు స్థాయి అధికారులు ప్రతీ ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని తెలిపారు. ఓటర్ల వివరాలు పూరించిన తర్వాత ప్రతిని బూతు స్థాయి అధికారికి అందించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తదితర కార్యక్రమాల అనంతరం తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1వ తేదీన ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్‌ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు అబ్బాస్, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమగ్ర నివేదికలు తయారు చేయాలి..
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో 99 రోజుల కార్యక్రమంపై రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య శాఖలతో పాటు ఇతర శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, వార్డు సభల్లో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల సంఖ్య, వాటి పరిష్కార స్థితి, పెండింగ్‌లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. వచ్చే వారంలో ప్రత్యేక అధికారి పర్యవేక్షణకు జిల్లాకు రానున్న నేపథ్యంలో, అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్‌కుమార్, డీఆర్‌ఓ వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు.


